ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన 'వాల్తేరు వీరయ్య'!
on Jan 19, 2023

మెగా అభిమానుల నిరీక్షణ ఫలిచింది. మెగాస్టార్ చిరంజీవి మెగా కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' చిత్రాలేవీ కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. దీంతో 'వాల్తేరు వీరయ్య'పైనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ 'వాల్తేరు వీరయ్య'తో మెగా కమ్ బ్యాక్ ఇచ్చిన చిరంజీవి అభిమానులకు అసలుసిసలు ఆనందాన్ని ఇచ్చారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన 'వాల్తేరు వీరయ్య' మొదటి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.91 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఓవరాల్ గా రూ.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సత్తా చాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.75 కోట్ల షేర్ రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా రూ.5.90 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.10.50 కోట్ల షేర్ కలిపి ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 91.40 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో మరో 30 కోట్ల షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. ఎందుకంటే దాదాపు అన్ని ఏరియాలలోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటిదాకా నైజాంలో రూ.24.47 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.14.21 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.36.33 కోట్ల షేర్ రాబట్టింది. యూఎస్ లోనూ 2 మిలియన్ డాలర్ మార్క్ అందుకొని సత్తా చాటింది. ఇలా అన్ని చోట్లా మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య చిత్రం ఫుల్ రన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



