'గాండీవధారి అర్జున'.. మరో విభిన్న చిత్రంలో మెగా హీరో!
on Jan 19, 2023

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రానికి 'గాండీవధారి అర్జున' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. ఈరోజు(జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో టైటిల్ తో పాటు మూవీ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. టైటిల్ మాదిరిగానే పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాంబు బ్లాస్ట్, తీవ్ర వాదులతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఒక చేత్తో తీవ్రవాదిని పట్టుకొని, మరో చేత్తో గన్ గురిపెట్టిన వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి ఇదొక భారీ యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'తొలిప్రేమ' వంటి హిట్ తర్వాత ఈ బ్యానర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న రెండో సినిమా కావడం విశేషం. వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కలయికలో మాత్రం ఇదే మొదటి సినిమా. ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఇద్దరూ ఎంతో పట్టుదలగా ఉన్నారు. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్.. గతేడాది 'గని' చిత్రంతో నిరాశపరిచాడు. వెంకటేష్ తో కలిసి చేసిన మల్టీస్టారర్ 'ఎఫ్-3'తో మాత్రం పర్లేదు అనిపించుకున్నాడు. ఇక ఈ ఏడాది 'గాండీవధారి అర్జున'తో సోలో హీరోగా హిట్ కొట్టి సత్తా చాటాలి అనుకుంటున్నాడు. మరోవైపు 'చందమామ కథలు', 'పిఎస్‌వి గరుడ వేగ' వంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు కూడా గత చిత్రం 'ది ఘోస్ట్'తో నిరాశపరిచాడు. మరి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న 'గాండీవధారి అర్జున' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



