సర్ ప్రైజ్.. తెలుగులో హిట్ దిశగా 'వారసుడు'!
on Jan 19, 2023

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమిళ చిత్రం 'వారిసు'. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే తెలుగులో మాత్రం 'వారసుడు' పేరుతో కాస్త ఆలస్యంగా జనవరి 14న విడుదలైంది. టాక్ గొప్పగా లేదు, పైగా సినిమా ఆలస్యంగా విడుదలైంది. దానికితోడు బాక్సాఫీస్ బరిలో 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగునాట వారసుడుకి కనీస కలెక్షన్లు కూడా రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఊహించని విధంగా తెలుగులో మంచి వసూళ్ళు రాబడుతూ హిట్ దిశగా పయనిస్తోంది.
తెలుగునాట సంక్రాంతి పండగ రోజు జనవరి 14న విడుదలైన 'వారసుడు' ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటిరోజు రూ.3.10 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. పండగ రోజు, పైగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆ కలెక్షన్స్ వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ రెండో రోజు నుంచి కూడా అదే జోరుని కొనసాగిస్తూ వస్తోంది. రెండో రోజు రూ.2.94 కోట్ల షేర్, మూడో రోజు రూ.2.69 కోట్ల షేర్, నాలుగో రూ.2.17 కోట్ల షేర్ వసూలు చేసింది. పండగ సెలవులు ముగిసినప్పటికీ ఐదో రోజయిన నిన్న రూ.1.41 కోట్ల షేర్ సాధించింది. దీంతో ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.12.31 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
తెలుగునాట వారసుడు థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ.14 కోట్లని అంచనా. అంటే మరో రెండు కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే. ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కలను పరిశీలిస్తే ఈ వీకెండ్ లోపులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఎంటరయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



