అలా చేసుంటే 'విరాట పర్వం' రిజల్ట్ మరోలా ఉండేది!
on Jun 20, 2022

ఈ మధ్య కాలంలో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో 'విరాట పర్వం' ఒకటి. జూన్ 17న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతోంది. వరల్డ్ వైడ్ గా రూ.14 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్(మొదటి మూడు రోజులు) పూర్తయ్యేసరికి 3.14 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మొదటి వీకెండ్ లోనే అంతగా ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 5 కోట్ల లోపే షేర్ రాబట్టే అవకాశముంది. అదే జరిగితే బయ్యర్లకు ఈ సినిమా 9-10 కోట్ల నష్టం మిగల్చనుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగలనున్న ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేసుంటే రిజల్ట్ వేరేలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి 'విరాట పర్వం' ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ మరియు ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల కానుందని కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమాకి ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్సే వచ్చాయట. అప్పటి పరిస్థితులు, బిజినెస్ లెక్కలు ఆలోచించి.. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామైన సురేష్ బాబు 'నారప్ప', 'దృశ్యం-2' సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఓటీటీకి ఇవ్వాలని భావించారట. అయితే హీరో రానా మరియు నిర్మాతలు ఈ సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేద్దామని పట్టుపట్టడంతో సురేష్ బాబు వెనకడుగు వేశారట. అదే ఇప్పుడు విరాట పర్వం కొంప ముంచింది అంటున్నారు.
'విరాట పర్వం'కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ ఈ సినిమా చూడటానికి సాధారణ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇది నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ తరం వారిని ఈ సినిమా ఆకర్షించలేకపోతోంది. పైగా ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఓటీటీలో బోలెడంత క్రియేటివ్ కంటెంట్ లభిస్తోంది. అధిక టికెట్ ధరల కాలంలో ఒక సాధారణ కుటుంబం థియేటర్ కి కదలాలంటే సినిమా కంటెంట్ వారిని ఓ రేంజ్ లో ఆకర్షించేలా ఉండాలి. కానీ ఈ తరం వాళ్ళని ఆకర్షించే అంశాలు విరాట పర్వంలో లేవు. ఓటీటీలో విడుదలయ్యాక చూడొచ్చులే అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. అదే ఈ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుంటే.. మరింత మందికి చేరువ అయ్యేది, మరిన్ని ప్రశంసలు అందుకునేది. అలాగే కమర్షియల్ ఫెయిల్యూర్ కూడా అనిపించుకునేది కాదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



