41 ఏళ్ళ `గడసరి అత్త - సొగసరి కోడలు`!
on Jun 20, 2022

తెలుగువారిని విశేషంగా అలరించిన జంటల్లో సూపర్ స్టార్ కృష్ణ - అతిలోక సుందరి శ్రీదేవి జోడీకి ప్రత్యేక స్థానముంది. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో `గడసరి అత్త - సొగసరి కోడలు` ఒకటి. `వియ్యాల వారి కయ్యాలు` (1979) వంటి సూపర్ హిట్ తరువాత కట్టా సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ఈ సినిమాలో.. `గడసరి అత్త`గా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి సందడి చేశారు. నాగభూషణం, రావుగోపాలరావు, కాంచన, హరనాథ్, పి.ఎల్. నారాయణ, రాజబాబు, రమాప్రభ, వరలక్ష్మి, మమత, జేవీ రమణమూర్తి, కాకరాల, నూతన్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. పినిశెట్టి కథను అందించడంతో పాటు కాశీ విశ్వనాథ్ తో కలిసి సంభాషణలు సమకూర్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం స్వరాలు సమకూర్చిన `గడసరి అత్త - సొగసరి కోడలు`కి దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``శ్రీ గౌరి``, ``అబ్బ అబ్బ దబ్బపండు``, ``చందమామ కంచమెట్టి``, ``తళాంగు తకథిమి``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. రాధాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన `గడసరి అత్త - సొగసరి కోడలు` .. 1981 జూన్ 20న విడుదలై విజయపథంలో పయనించింది. నేటితో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 41 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



