ENGLISH | TELUGU  

బాయ్ కాట్ 'లాల్ సింగ్ చడ్డా'.. చిరు, నాగ్ కి విజయశాంతి చురకలు!

on Aug 3, 2022

బాలీవుడ్ సినిమాలకు కొంతకాలంగా బాయ్ కాట్ సెగ తగులుతోంది. ముఖ్యంగా ఆగస్టు 11న విడుదల కానున్న ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2014 లో వచ్చిన 'పీకే' మూవీలో శివుడిని అవమానించేలా సన్నివేశాలు ఉండటంతో పాటు, 2015లో ఇండియాలో రక్షణ లేదంటూ ఆమిర్ చేసిన వ్యాఖ్యలే ఈ బాయ్ కాట్ కు కారణం. అయితే ఆ తర్వాత వచ్చిన 'దంగల్'(2016)కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా, అనూహ్యంగా 6-7 ఏళ్ళ తర్వాత వస్తున్న 'లాల్ సింగ్ చడ్డా'కు బాయ్ కాట్ సెగ తగలడం గమనార్హం. దయచేసి తన సినిమాని బాయ్ కాట్ చేయొద్దని ఆమిర్ వేడుకున్నా ఈ బాయ్ కాట్ పిలుపులు ఆగట్లేదు. తాజాగా సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి సైతం ఈ బాయ్ కాట్ కి మద్దతు తెలపడం విశేషం.

"ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే... ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు." అంటూ విజయశాంతి వరుస సంచలన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 

"భారత్‌లో అసహనం పెరిగిపోయిందని... ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో... ఇప్పటికీ పొందుతున్నారో... చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ... వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు." అని ట్వీట్ చేశారు విజయశాంతి.

"గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే...ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అనే...ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్... గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో...ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నారు. దురదృష్టమేంటంటే.... జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు...ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ  టీవీషోల్లో పాల్గొంటున్నారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా  వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి." అంటూ ఆమిర్ తో పాటు సౌత్ హీరోలకు కూడా చురకలు వేశారు రాములమ్మ.

'లాల్ సింగ్ చడ్డా'లో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటం విశేషం. అంతేకాదు కింగ్ నాగార్జునతో కలిసి చిరంజీవి ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అంటే విజయశాంతి సౌత్ హీరోలని సంబోధిస్తూ పరోక్షంగా చిరంజీవి, నాగార్జునలకు చురకలు వేశారన్నమాట.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.