ENGLISH | TELUGU  

కొంపముంచిన 'వారసుడు'.. దిల్ రాజు లెక్క తప్పింది!

on Jan 11, 2023

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమిళ్ మూవీ 'వారిసు' తెలుగులో 'వారసుడు' పేరుతో ఈరోజే విడుదల కావాల్సి ఉంది. కానీ డబ్బింగ్ చిత్రం కోసం భారీగా థియేటర్లు బ్లాక్ చేసి.. బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రాలకు థియేటర్లు లేకుండా చేస్తున్నాడంటూ దిల్ రాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తెలుగు సినిమాల ప్రయోజనం కోసం 'వారిసు' తెలుగు వెర్షన్ ని వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. జనవరి 11న విడుదల కావాల్సిన 'వారసుడు'ని జనవరి 14కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆయన కొంప ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'వారిసు' మూవీ ఈరోజు విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రొటీన్ గా ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు.. ఇందులో ఎన్నో తెలుగు సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి, తెలుగునాట ఆడటం కష్టమే, తమిళ్ వాళ్లకి కొత్త కాబట్టి అక్కడ ఆడే అవకాశముందని కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు తమిళనాట కూడా డివైడ్ టాక్ వినిపిస్తోంది. దానితో పాటు విడుదలైన 'తునివు' కూడా యావరేజ్ టాక్ తెచ్చుకోవడం ఒక్కటే అక్కడ 'వారిసు'కి కలిసొచ్చే అంశం.

ట్రైలర్ వచ్చినప్పుడే 'వారసుడు'పై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఫ్యామిలీ సినిమా, అందునా సంక్రాంతి సీజన్ కాబట్టి.. ఈరోజు విడుదలయ్యుంటే చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవేమో. కానీ మూవీ విడుదల తమిళ్ లో ఈరోజు, తెలుగులో 14న కావడంతో.. తెలుగు ప్రేక్షకులకు కూడా ముందే రిజల్ట్ తెలిసిపోయింది. ఇక్కడ కూడా తమిళ్ వెర్షన్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. ఈ డివైడ్ టాక్ విని 'వారుసుడు' కోసం తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు కదలడం అనుమానమే. పైగా రేపు 'వీరసింహారెడ్డి', ఎల్లుండి 'వాల్తేరు వీరయ్య' సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఇక వారసుడు కనీస వసూళ్ళు రాబట్టడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.