వింగ్ కమాండర్ అభినందన్ పాత్రలో వరుణ్ తేజ్!
on Sep 19, 2022
సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తన గత చిత్రాలు 'గని', 'ఎఫ్-3' నిరాశపరచడంతో ఈసారి విభిన్న చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తన 12వ సినిమాని ప్రకటించిన వరుణ్.. తాజాగా తన 13వ సినిమాని ప్రకటించాడు. ఇందులో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.
సోనీ పిక్చర్స్, రెనసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో యుద్ధ విమానాల ముందు వింగ్ కమాండర్ దుస్తుల్లో వరుణ్ కనిపిస్తున్నాడు. అలాగే పోస్టర్ పై వాస్తవ సంఘటనల ఆధారంగా అని రాసుంది.
ఈ చిత్రం 2019లో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన 'బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్' నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'మిగ్-21'తో దానికంటే శక్తివంతమైన 'ఎఫ్-16'ని కూల్చివేసి, దురదృష్టవశాత్తు పాకిస్థాన్ భూభాగంలో పడిపోయి అక్కడి సైనికుల చేతికి చిక్కాడు. వారి చేతిలో చిత్రహింసలకు గురై, చివరికి ప్రభుత్వ జోక్యంతో భారత్ కు క్షేమంగా తిరిగొచ్చాడు. ఆ రియల్ హీరో అభినందన్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడని సమాచారం. పోస్టర్ ని బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అదే నిజమైతే ఈ చిత్రానికి పాన్ ఇండియా రేంజ్ లో ఆదరణ లభించే అవకాశముంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టే ఛాన్స్ ఉంది.
'VT13' పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు ప్రముఖ నిర్మాత dil రాజు హాజరయ్యాడు. ముహూర్తపు సన్నివేశానికి ఆయనే క్లాప్ కొట్టాడు.
Also Read