అక్కినేని-సావిత్రి 'సిరిసంపదలు' వచ్చి నేటికి సరిగ్గా 60 ఏళ్లు
on Sep 19, 2022
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ఒకటి 'సిరిసంపదలు'. పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మ్యూజికల్‌గానూ పెద్ద హిట్. ఆ రోజుల్లో "ఎందుకో సిగ్గెందుకో" (శ్రీశ్రీ), "ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా", "చిట్టిపొట్టి పాపలు", వేణుగానమ్ము వినిపించెనే" (ఆత్రేయ), "కొండమ్మో బంగారు కొండమ్మో" (కొసరాజు) పాటలు ఏ చోటకు వెళ్లినా వినిపిస్తూ ఉండేవి. ఇప్పటికీ ఆ పాటలను ఆస్వాదిస్తోన్న సంగీత ప్రియులు ఎందరో! మాస్టర్ వేణు స్వరాలు కూర్చిన ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ, కొసరాజు, శ్రీశ్రీ రాశారు.
భుజంగం (రాజనాల) అనే వడ్డీ వ్యాపారి వల్ల కష్టాల పాలైన మామయ్య జగపతినాయుడు (గుమ్మడి)కీ, ఆయన కుమార్తెలు పద్మ (సావిత్రి), లత (వాసంతి), రమ (గిరిజ)లకూ అండగా నిలిచి, జప్తు నుంచి ఆయన ఇంటిని రక్షించుకున్న ప్రసాద్ (అక్కినేని నాగేశ్వరరావు) కథ ఇది. చిన్నతనంలోనే ఒకరంటే ఒకరు ఇష్టపడి, విధి కారణంగా వేరై, చివరకు ఒకటైన ప్రసాద్, పద్మ పాత్రల్లో అక్కినేని, సావిత్రి నటన, వారి ప్రేమకథ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి కథ, సంభాషణలు పినిశెట్టి శ్రీరామమూర్తి (రవిరాజా పినిశెట్టి తండ్రి) రాశారు. 'వేంకటేశ్వర మహత్యం' లాంటి సూపర్ హిట్ సినిమా తీశాక, ఓ సోషల్ డ్రామా తియ్యాలని అనుకున్న పి. పుల్లయ్య, కథను రాయమని పినిశెట్టికి సూచించారు. అప్పటికే పినిశెట్టి, 'రాజు-పేద' (1954), 'ఇలవేల్పు' చిత్రాల రచయితగా వెలుగులోకి వచ్చారు. తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని తెలియజేస్తూ ఈ కథ రాశారాయన.
చిత్తూరు నాగయ్య, రేలంగి, శాంతకుమారి, సూర్యకాంతం, రమణారెడ్డి, సురభి బాలసరస్వతి లాంటి ఉద్ధండులు కూడా నటించిన ఈ సినిమాలో డాక్టర్ శివరామకృష్ణయ్య, ఎం. ప్రభాకర్‌రెడ్డి అతిథి పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై వి. వెంకటేశ్వర్లు నిర్మించగా, మాధవ్ బుల్బులే ఛాయాగ్రహణం, ఎన్.ఎమ్. శంకర్ ఎడిటింగ్, ఎస్. కృష్ణారావు కళా దర్శకత్వం వహించారు. ఘంటసాల, ఎస్. జానకి, స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు, శాంతకుమారి, పి. సుశీల, జిక్కి పాటలను ఆలపించారు. "చిట్టిపొట్టి పాపలు" పాటను శాంతకుమారి ఆలపించిన వైనం అద్భుతం.
1962 సెప్టెంబర్ 19న విడుదలైన 'సిరిసంపదలు' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రాల్లో ఒకటిగా జాతీయ అవార్డులో ప్రశంసాపత్రాన్ని (సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్) అందుకుంది.
Also Read