‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ డేట్ మారుతుందా?
on Sep 2, 2023

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన ఈ రవితేజ తొలిసారి పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నారు. దసరా సందర్భంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్ మారనుంది. అంటే మూవీ రిలీజ్ వెనక్కి వెళ్లటం లేదు. ప్రీ పోన్ అవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఎప్పుడో అక్టోబర్ 20న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అకస్మాత్తుగా ప్రీ పోన్ చేయటానికి కారణం ప్రభాస్ అని తెలుస్తోంది. అసలు ప్రభాస్‌కి, ‘టైగర్ నాగేశ్వరరావు’కి ఉన్న లింకేంటి? అనే అనుమానం రావచ్చు. వివరాల్లోకి వెళితే సెప్టెంబర్ 28న ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ మూవీ అనుకోకుండా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్ తమ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. డైరెక్టర్ వంశీ ఇప్పటికే ప్యాచ్ వర్క్ పూర్తి చేయటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇకపై ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసి సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగానే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను రూపొందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



