బర్త్ డే స్పెషల్ః బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టిన ముగ్గురు దర్శకులు!
on Jun 10, 2022

(జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా..)
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఎందరో దర్శకులకు లక్కీ హీరో. మరీముఖ్యంగా.. ముగ్గురు అగ్ర దర్శకులకైతే బాలయ్యతో తీసిన మూడు వరుస చిత్రాలు మెమరబుల్ హిట్స్ గా నిలిచాయి. బాలయ్యని ఆయా నిర్దేశకులకు హ్యాట్రిక్ కాంబోగా నిలిపాయి. ఆ వివరాల్లోకి వెళితే..
కోడి రామకృష్ణః
బాలకృష్ణ కథానాయకుడిగా ఎదిగే దశలో తనతో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ తీసిన మూడు వరుస చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ చిత్రాలే.. `మంగమ్మ గారి మనవడు` (1984), `ముద్దుల కృష్ణయ్య` (1986), `మువ్వ గోపాలుడు` (1987). ఈ మూడు సినిమాలను కూడా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించడం విశేషం. ఈ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత కూడా బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబో కొన్ని విజయాలు చూశారు.
బి. గోపాల్ః
అగ్ర దర్శకుడు బి. గోపాల్ కి బెస్ట్ కాంబినేషన్ అంటే బాలయ్య అనే చెప్పాలి. `లారీ డ్రైవర్` (1990), `రౌడీ ఇన్ స్పెక్టర్` (1992), `సమరసింహారెడ్డి` (1999).. ఇలా బాలయ్యతో గోపాల్ తీసిన మూడు వరుస చిత్రాలు ఘనవిజయం సాధించి వారిని హ్యాట్రిక్ కాంబోగా నిలిపాయి. ఇక నాలుగో సినిమాగా వచ్చిన `నరసింహనాయుడు`(2001) కూడా సక్సెస్ బాట పట్టింది. వీటిలో `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` అయితే ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
బోయపాటి శ్రీనుః
రీసెంట్ టైమ్స్ లో బాలయ్యకి అచ్చొచ్చిన దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు బోయపాటి శ్రీను. `సింహా` (2010), `లెజెండ్` (2014), `అఖండ` (2021).. ఇలా బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కించిన మూడు వరుస చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ బాట పట్టాయి. వీరిని హ్యాట్రిక్ కాంబోగా నిలిపాయి.
మరి.. మున్ముందు ఈ జాబితాలో ఇంకెంతమంది దర్శకులు చేరతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



