జూలై బాక్సాఫీస్ః ఆ దర్శకులకి పరీక్షా కాలమే!
on Jun 21, 2022
2022 జూలైలో పలు ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు ఆయా దర్శకులకు పరీక్ష అనే చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే..
మారుతిః- ఈ తరం దర్శకుల్లో మారుతి ట్రాక్ రికార్డే వేరు. తన కెరీర్ లో సింహభాగం విజయాలే చూశారాయన. అయితే, తన గత చిత్రం `మంచి రోజులు వచ్చాయి`(2021) మాత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో.. జూలై 1న రాబోతున్న `పక్కా కమర్షియల్`పైనే తన ఆశలు పెట్టుకున్నారు మారుతి. ఇందులో గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విక్రమ్ కె. కుమార్ః- `ఇష్క్` (2012), `మనం` (2014) చిత్రాలతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు దర్శకుడు విక్రమ్ కె. కుమార్. అయితే, రీసెంట్ టైమ్స్ లో `హలో` (2017), `గ్యాంగ్ లీడర్` (2019) - ఇలా విక్రమ్ తీసిన చిత్రాలు నిరాశపరిచాయి. ఈ క్రమంలో.. జూలై 8న తెరపైకి రానున్న `థాంక్ యూ`పైనే తన ఆశలు ఉన్నాయి. ఇందులో నాగచైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఎన్. లింగుస్వామిః- రన్ (2003), `పందెం కోడి` (2006), `ఆవారా` (2010) వంటి విజయవంతమైన తమిళ అనువాదాలతో లింగుస్వామి తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే. అయితే, రీసెంట్ టైమ్స్ లో తన ట్రాక్ రికార్డ్ అంత బాగోలేదు. అందుకే.. జూలై 14న రానున్న `ద వారియర్` ఫలితం తనకి ఎంతో కీలకంగా మారింది. రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ కాప్ డ్రామా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజున రిలీజ్ కానుంది.
చందు మొండేటిః- `కార్తికేయ` (2014), `ప్రేమమ్` (2016)తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన చందు మొండేటి.. `సవ్యసాచి` (2018), `బ్లడీ మేరీ` (2022)తో ట్రాక్ తప్పారు. ఈ నేపథ్యంలో.. జూలై 22న రానున్న `కార్తికేయ 2` రిజల్ట్ తనకి ఎంతో ముఖ్యం. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా సందడి చేయనున్నారు.
మరి.. జూలై మాసంలో వరుస వారాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మారుతి, విక్రమ్, లింగుస్వామి, చందు మొండేటి.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
