భార్యకు నెలకు రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని పృథ్వీని ఆదేశించిన కోర్టు!
on Oct 1, 2022

కమెడియన్ '30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' పృథ్వీకి ఫ్యామిలీ కోర్టు నుంచి చుక్కెదురైంది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా ఆయన రూ. 8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. శ్రీలక్ష్మి స్వస్థలం విజయవాడ కాగా, పృథ్వీది తాడేపల్లిగూడెం. వారికి 1984లో పెళ్లయింది. కొన్నాళ్లుగా ఆ ఇద్దరూ కలిసి జీవించడం లేదు. శ్రీలక్ష్మి తమ ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడలోని పుట్టింట్లో ఉంటుండగా, పృథ్వీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
తన భర్త పృథ్వీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ నెలకు రూ. 30 లక్షల దాకా సంపాదిస్తున్నారని, ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం ఇప్పించాలని కోరుతూ 2017 జనవరిలో శ్రీలక్ష్మి విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (ఫ్యామిలీ కోర్టు)లో కేసు వేశారు. పెళ్లయిన కొత్తలో తన భర్త విజయవాడలోని తమ పుట్టింట్లో ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేసేవాడనీ, అతని ఖర్చులన్నీ తమ తల్లితండ్రులే భరిస్తూ వచ్చేవారనీ ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. అంతే కాకుండా, సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాత తరచూ తనను వేధిస్తూ వచ్చేవాడనీ, 2016 ఏప్రిల్ 5న తనను ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడనీ, అప్పట్నుంచీ తాను పుట్టింట్లో ఉంటున్నాననీ ఆమె ఫిర్యాదు చేసింది.
ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీలోగా ఆమెకు భరణం చెల్లించాలని పృథ్వీకి ఆదేశాలిచ్చింది. అలాగే, ఆమె కేసు దాఖలు చేసిన మొదలు ఇప్పటిదాకా అయిన ఖర్చులను కూడా ఆయనే భరించాలని కూడా చెప్పింది. పృథ్వీ పూర్తి పేరు బాలిరెడ్డి పృథ్వీరాజ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



