దిల్ రాజు మాట తప్పాడు.. 'థాంక్యూ'కి కూడా బాదుడే బాదుడు!
on Jul 20, 2022
.webp)
చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా ఉంది టాలీవుడ్ నిర్మాతల తీరు. అధిక టికెట్ ధరలు మరియు అందుబాటులో ఓటీటీల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడంలేదు.. అందుకే తమ సినిమాని తక్కువ టికెట్ ధరలతోనే విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నారు నిర్మాతలు. పాపం మనం కోసం నిర్మాతలు దిగొచ్చారు అంటూ సినీ ప్రియులు టికెట్స్ బుక్ చేద్దామని బుక్ మై షో లాంటివి ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు గాని తెలియట్లేదు వాళ్ళు చెప్పే రేట్లకి, అమ్మే రేట్లకి సంబంధం లేదని.
మొన్నటికి మొన్న టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఓటీటీల కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారని, తాను నిర్మించిన 'థాంక్యూ' సినిమాని థియేటర్స్ లో చాలా తక్కువ ధరలతో విడుదల చేస్తున్నానని ప్రకటించాడు. అధికంగా సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.150 ఉంటుందని.. జీఎస్టీ తో కలిపి సింగిల్ స్క్రీన్స్ లో రూ.112, మల్టీప్లెక్స్ లలో రూ.177 ఉంటుందని చెప్పాడు. దాంతో దిల్ రాజు మంచి నిర్ణయం తీసుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఆ నిర్ణయం మాటలకే పరిమితమని తాజాగా రుజువైంది.
జులై 22న విడుదల కానున్న 'థాంక్యూ' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ టికెట్ ధరలు దిల్ రాజు చెప్పిన దానికంటే అధికంగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో రూ.150-175 ఉండగా, మల్టీప్లెక్స్ లలో రూ.200-250 చూపిస్తోంది. ఈ టికెట్ ధరలు జీఎస్టీతో కలిపి అయినప్పటికీ.. ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కన్వీనియన్స్ ఫీజు కింద ఒక్కో టికెట్ కి అదనంగా మరో రూ.25-30 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో నిర్మాతల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి తమకు సినిమా చూడాల్సిన అవసరం లేదని, ఓటీటీలో వచ్చేవరకు ఎదురు చూస్తామని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'క్షవరం అయితే కానీ వివరం రాదు' అంటారు.. మరి అదేంటో వరుసగా ఎన్ని సినిమాలకు షాక్ తగులుతున్నా, టికెట్ ధరలపై నిర్మాతల తీరు మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



