వెనక్కి తగ్గిన 'స్వాతిముత్యం'
on Aug 3, 2022
కొంతకాలంగా ప్రేక్షకులు థియేటర్స్ కి అంతగా రాకపోవడంతో సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఈ ప్రభావం విడుదలకు సిద్ధమవుతున్న కొత్త సినిమాలపై పడుతోంది. అసలే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో.. పోటాపోటీగా సినిమాలు విడుదల చేయకూడదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలు విడుదల తేదీని త్యాగం చేస్తున్నాయి. తాజాగా 'స్వాతిముత్యం' సినిమాకి అలాంటి పరిస్థితే వచ్చింది.
గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'స్వాతిముత్యం'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది.
'స్వాతిముత్యం' సినిమాని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. వాయిదా వేయడం మనసుకి కష్టంగా అనిపించినా.. సినీ పరిశ్రమ, ఇతర నిర్మాతల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సితార సంస్థ తెలిపింది. "మహమ్మారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకుముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి చూసి, ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి మునుపటిలాగ సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము." అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సూర్య, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
