పాతికేళ్ళ తరువాత మణిశర్మ బాటలోనే మహతి స్వర సాగర్!
on Dec 14, 2021

`బావగారూ.. బాగున్నారా!`, `చూడాలని వుంది!`.. ఇలా మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి స్వరాలు సమకూర్చడమే కాకుండా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఘనత మెలోడీబ్రహ్మ మణిశర్మది. 1998లో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా మణిశర్మకి చిరు కాంబోలో తొలి, మలి చిత్రాలు. కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే బాటలో మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ కూడా వెళ్ళనున్నట్లు సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఛలో`, `భీష్మ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల త్వరలో మెగాస్టార్ చిరంజీవితో తన కొత్త సినిమాని తెరకెక్కించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ `మెగా 156`గా జనం ముందుకు రానుంది. కాగా, వెంకీ గత చిత్రాలు `ఛలో`, `భీష్మ`కి బాణీలు అందించిన మహతి స్వర సాగర్... ఈ సినిమాకి కూడా ట్యూన్స్ కట్టనున్నాడట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిరంజీవి `భోళా శంకర్`(మెగా 155)కి కూడా మహతినే సంగీత దర్శకుడు. సో.. దాదాపు పాతికేళ్ళ తరువాత మణిశర్మ తరహాలో అతని తనయుడు మహతి కూడా మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి స్వరాలు సమకూర్చడం విశేషమనే చెప్పాలి. మరి.. మణి బాటలోనే మహతి కూడా చిరు కాంబోలోని తొలి, మలి చిత్రాలతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటాడేమో చూడాలి.
కాగా, త్వరలోనే చిరు - వెంకీ కుడుముల కాంబో మూవీలో మహతి స్వర సాగర్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



