సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ రివ్యూ
on Dec 28, 2019
నటీనటులు: 'సుడిగాలి' సుధీర్, ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్, షాయాజీ షిండే, పృథ్వీ, శివ ప్రసాద్, గద్దర్ తదితరులు
సినిమాటోగ్రఫర్ : సి. రామ్ ప్రసాద్
ఎడిటర్: గౌతమ్ రాజు
సంగీతం: భీమ్స్
నిర్మాత: శేఖర్ రాజు
దర్శకత్వం: పి. రాజశేఖర్ రెడ్డి
విడుదల తేదీ: 28 డిసెంబర్ 2019
'సుడిగాలి' సుధీర్... బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'తో ప్రతి ఇంట్లో నవ్వులు పోయిస్తున్నాడు. డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో నవ్విస్తున్నాడు. డాన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. అతడు హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సాఫ్ట్వేర్ సుధీర్'. ధన్యా బాలకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ:
చందు (సుడిగాలి సుధీర్) అమాయకుడు. కానీ, మంచోడు. మంత్రి (శివ ప్రసాద్) దగ్గర అతడి తండ్రి (షాయాజీ షిండే) పని చేస్తుంటాడు. తండ్రి సిఫారసుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చందుకు ఉద్యోగం వస్తుంది. అదే ఆఫీసులో పని చేసే స్వాతి (ధన్యా బాలకృష్ణ)తో ప్రేమలో పడతాడు. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిన తర్వాత అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అయ్యే స్వాతి సలహా మేరకు... ఆమెతో కలిసి చందు ఒక స్వామిజీని కలుస్తాడు. చందు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మంత్రి డబ్బు వెయ్యి కోట్లను స్వామీజీ కొట్టేస్తాడు. తన డబ్బు తిరిగి తీసుకురాకపోతే కుటుంబంలో అందరినీ చంపేస్తానని మంత్రి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు చందు ఏం చేశాడు? డబ్బు కొట్టేయడం వెనుక ఎవరున్నారు? ఏంటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ:
ఇదొక క్రాస్ జానర్ సినిమా. వినోదాత్మక సన్నివేశాలతో ప్రారంభమైన సినిమా... కాసేపటికి ఫాంటసీ జానర్ లోకి వెళుతుంది. అక్కడ నుండి థ్రిల్లర్ జానర్ లోకి టర్న్ తీసుకుంటుంది. చివరికి రైతు సమస్యల నేపథ్యంలో చక్కటి సందేశంతో ముగుస్తుంది. ఒక జానర్ నుండి మరో జానర్ కి వెళ్లే సమయంలో కథనం మరింత ఆసక్తికరంగా ఉంటే బావుండేది. అది కొరవడింది. ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఉదాహరణకు... కొన్ని కామెడీ సీన్స్. హీరోగా సుడిగాలి సుధీర్ సినిమా చేస్తున్నాడంటే... 'జబర్దస్త్' షోలో అతడు చేసే కామెడీకి మించిన కామెడీని ప్రేక్షకులు ఆశిస్తాడు. ఆ స్థాయి వినోదం ఇవ్వడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సూపర్బ్ పంచ్ డైలాగులు రాసుకోవడంలోనూ ఫెయిల్ అయ్యాడు. ఇక, సంగీతం విషయానికి వస్తే భీమ్స్ మంచి పాటలు ఇచ్చాడు. 'కోయంబత్తూర్ పీసు'కు సురేష్ ఉపాధ్యాయ మాస్ లిరిక్స్ రాస్తే, 'ఇంత అందమే'కు ఆహ్లదకరమైన లిరిక్స్ రాశాడు. గద్దర్ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా పాడిన 'మేలుకో రైతన్న' ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. టీవీ స్టార్ తో సినిమా తీస్తున్నామని తక్కువ బడ్జెట్ లో చుట్టేయకుండా... లావిష్ గా తీశారు. పాటలకు ఫారిన్ వెళ్లారు.
ప్లస్ పాయింట్స్:
సుడిగాలి సుధీర్
వినోదం
పాటలు
కథలో మలుపులు
మైనస్ పాయింట్స్ :
దర్శకత్వం
రొటీన్, లాజిజ్ లేని సీన్స్
ఆకట్టుకొని స్క్రీన్ ప్లే
నటీనటుల అభినయం:
బుల్లితెరపై సుధీర్ కి రొమాంటిక్, ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. వెండితెరపై కొన్ని సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తన ఇమేజ్ కి భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. అమాయకుడిగా అద్భుతంగా నటించాడు. పాటల్లో డాన్స్ బాగా చేశాడు. ధన్యా బాలకృష్ణ గత సినిమాల్లో నటిగా నిరూపించుకుంది. ఈ సినిమాలో ట్విస్ట్ తో కూడిన పాత్రలో బాగా చేసింది. సీనియర్ నటీనటులు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ పాత్రల పరిధి మేరకు చేశారు. నిర్మాత శేఖర్ రాజు హీరో స్నేహితుడిగా మంచి పాత్ర చేశారు.
తెలుగువన్ పర్స్పెక్టివ్:
'సుడిగాలి' సుధీర్ నుండి విపరీతమైన కామెడీ ఆశించి సినిమాకు వెళితే కాస్త నిరాశ పడతారు. అలా కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళితే... ప్రేక్షకులను మెప్పించే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5