'సీతా రామం' ట్రైలర్.. 20 ఏళ్ళ క్రితం నాటి ఉత్తరంతో ప్రయాణం!
on Jul 25, 2022

ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తి పెంచుతున్న సినిమాలలో 'సీతా రామం' ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకుడు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో రష్మిక మందన్న కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
20 ఏళ్ళ క్రితం లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) సీతామహాలక్ష్మీ(మృణాల్)కి రాసిన ఉత్తరాన్ని పట్టుకొని వారిని వెతికే బాధ్యత అఫ్రీన్(రష్మిక) తీసుకున్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైంది. ఆమె ఎక్కడెక్కడికో వెళ్తుంది, ఎవరెవర్నో అడుగుతుంది.. కానీ వారిద్దరి గురించి ఎటువంటి సమాచారం తెలియదు. మరోవైపు అనాథ అయిన లెఫ్టినెంట్ రామ్ కు ఉత్తరాల ద్వారా సీతామహాలక్ష్మీ ఎలా పరిచయమైంది?, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది?, ఆ తర్వాత వారికి ఏం జరిగింది? వంటి అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సీత, రామ్ ల ప్రేమ కథ ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? అంటూ అఫ్రీన్ తెలుసుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తోంది. ట్రైలర్ లో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



