రీజనబుల్ రేట్లతో 'రామారావు ఆన్ డ్యూటీ'!
on Jul 25, 2022

ఒకప్పుడు సినిమా విడుదలవుతుందంటే టీజర్, ట్రైలర్ ఎలా ఉన్నాయని మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఎంత టీజర్, ట్రైలర్ బాగున్నా టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే థియేటర్స్ కి వెళ్ళాలి.. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు ఎదురు చూడాలి అనే ధోరణి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. దీంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో విడుదల చేస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఆరేడు వారాలుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి 'రామారావు ఆన్ డ్యూటీ'పై పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రీజనల్ రేట్లతో సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది మూవీ టీమ్. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంచుమించు ఒకే ధరలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది ఈ చిత్రం.
'రామారావు ఆన్ డ్యూటీ' టికెట్ ధరలు ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ లో అధికంగా రూ.147, మల్టీప్లెక్స్ లలో రూ.177 కాగా.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.195 గా ఉంటాయి. జీఎస్టీతో కలుపుకొని ఈ ధరలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ లోని ఒకట్రెండు మల్టీప్లెక్స్ లలో మాత్రం రూ.200-300 గా ఉండనున్నాయి. మెజారిటీ థియేటర్స్ లో రూ.200 లోపు ఉండటంతో, 'రామారావు ఆన్ డ్యూటీ' టికెట్ ధరలు రీజనబుల్ గానే ఉన్నాయన్న అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి రీజనబుల్ రేట్లతో బరిలోకి దిగుతున్న రామారావు.. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి, మెప్పిస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



