నా డిక్షనరీలో 'రొటీన్'కి చోటు లేదు: సమంత
on Mar 30, 2019
పెళ్లి తరవాత సమంత రూటు మార్చారు. కమర్షియల్ కథలను పక్కనపెట్టి కొత్త కథలకు, కథానాయిక పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకు ఓటు వేస్తున్నారు. 'ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో, ఫక్తు కమర్షియల్ కథల్లో నటించే ఉద్దేశం లేదా?' అని సమంతను ప్రశ్నిస్తే... "నా డిక్షనరీలో 'రెగ్యులర్', 'రొటీన్' అనే సినిమాలకు చోటు లేదు. కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో అటువంటి సినిమాలు చేశా. ఇప్పుడా దశ దాటేశా. అప్పట్లో చేతిలో సినిమాలు లేకపోతే సమంత పని అయిపోయిందని అనుకుంటున్నారని వచ్చిన అవకాశాలను అంగీకరించా. ఇప్పుడు అటువంటి భయం లేదు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా మార్పును కోరుకుంటున్నారు. మహిళలు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు చేయడంలో అర్థం లేదు. సినిమా సినిమాకీ నటిగా నేను ఎదగాలి. పాత్రల పరంగా వైవిధ్యం చూపించాలి. ఓసారి నటించిన పాత్రలో మరోసారి నటించడం ఇష్టం లేదు" అని సమాధానం ఇచ్చారు.
పెళ్లి తరవాత భర్త నాగచైతన్యతో సమంత నటించిన సినిమా 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు. ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో సమంత మాట్లాడుతూ "పెళ్లి తరవాత ప్రేమలో చాలా మార్పులు వస్తాయి. ఆ ప్రేమకథతో ఎవరైనా సినిమా చేస్తే బావుంటుందని భావిస్తున్న సమయంలో శివ నిర్వాణగారు 'మజిలీ' కథ చెప్పారు. వెంటనే ఒప్పేసుకున్నా. అయితే... ఈ కథకు, పెళ్లి తరవాత మా నిజజీవిత కథకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కథలా ఉంటే బోల్డన్ని సమస్యలు వస్తాయి" అని చెప్పారు. 'మజిలీ'లో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ఆమె అన్నారు. ఆల్రెడీ సినిమా చూశానని, ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు.
'మజిలీ' ప్రచార చిత్రాల్లో మరో కథానాయిక దివ్యాన్ష కౌశిక్, నాగచైతన్య ముద్దుపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపైనా సమంత స్పందించారు. "ముద్దు కావొచ్చు... కౌగిలింత కావొచ్చు... స్పర్శ కావొచ్చు... తెరపై చేసేదంతా నటనే. నేను ఆ ముద్దును నటనగానే చూశా. నేను కూడా నటనలో భాగంగా అటువంటి సన్నివేశాల్లో నటిస్తా. అందులో తప్పేముంది? ఆ సన్నివేశం ఉన్నట్టు ముందుగా నాకు తెలియదు. ఒకరోజు శివ నిర్వాణగారు చూపించారు. 'ముద్దే కదా' అన్నాను. గతంలో ట్రోలింగ్ ని సీరియస్ గా తీసుకుని బాధపడేదాన్ని. ఇప్పుడు అలవాటైంది. అంతా లైట్" అన్నారు.
Also Read