ENGLISH | TELUGU  

'రూలర్' మూవీ రివ్యూ

on Dec 20, 2019

 

సినిమా పేరు: రూలర్
తారాగణం: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, జయసుధ, ప్రకాశ్ రాజ్, భూమిక ఇక్బాల్ చావ్లా, షతాఫ్ ఫిగర్, సాయాజీ షిండే, సప్తగిరి, నాగినీడు, ఝాన్సీ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్, రఘు కారుమంచి
కథ: పరుచూరి మురళి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల
సంగీతం: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఆర్ట్: చిన్నా
సహనిర్మాతలు: సి.వి. రావు, పత్సా నాగరాజు
నిర్మాత: సి. కల్యాణ్
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: కె.ఎస్. రవికుమార్
బ్యానర్: హ్యాపీ మూవీస్
విడుదల తేదీ: 20 డిసెంబర్ 2018

బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కలయికలో ఇదివరకు వచ్చిన 'జై సింహా' సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయినప్పటికీ బాలయ్య మరోసారి రవికుమార్‌పై నమ్మకం ఉంచి 'రూలర్' సినిమా చేస్తున్నారనే విషయం తెలిశాక ఆయన అభిమాన గణమే ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యింది. ట్రైలర్ రిలీజ్ కాకముందే, అదివరకు రిలీజ్ చేసిన స్టిల్స్‌తోటే బాలయ్య ఈ సినిమాలో రెండు ఛాయలున్న క్యారెక్టర్ చేశారనే విషయం అర్థమైంది. బాలయ్యను ఆకట్టుకున్న ఆ కథ ఎలా ఉంది? ఆ కథను రవికుమార్ ఎలా తెరకెక్కించారు? చూద్దాం...

కథ: 
ఏసియాన్ అనే కార్పొరేట్ కంపెనీ యజమానురాలు సరోజినీ నాయుడు (జయసుధ)కు తీవ్ర గాయాలతో ఒక వ్యక్తి తారసపడతాడు. అతడిని ఆమె రక్షిస్తుంది. తలకు తగిలిన బలమైన గాయం కారణంగా అతడు గతాన్ని మర్చిపోయాడని తెలుసుకున్న సరోజిని, అదివరకే చనిపోయిన తన కొడుకు అర్జున్ ప్రసాద్ పేరునీ, ఆ స్థానాన్నీ అతడికి ఇస్తుంది. ఆమె కొడుకుగానే చలామణీ అవుతాడు అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ). ఉత్తరప్రదేశ్‌లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవంతో అక్కడ వచ్చిన ఒక ప్రాజెక్టును సరోజిని తిరస్కరిస్తే, ఆమెను వారించి ఆ ప్రాజెక్టు చేపడతాడు అర్జున్. అక్కడ అతడిని చూసిన తెలుగు కుటుంబాలు సంతోషంతో తబ్బిబ్బవుతాయి. అక్కడే తన అసలు పేరు ధర్మా అనీ, తను ఆ ప్రాంతం వాడినేననీ అతడికి తెలుస్తుంది. ధర్మా వెనకున్న కథేమిటి? ఆ ప్రాంతాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకొని అరాచకం సృష్టిస్తోన్న మినిస్టర్ భవానీనాథ్ ఠాగూర్ (బెంగాలీ నటుడు షతాఫ్ ఫిగర్) అంతు ఎలా చూశాడనేది మిగతా కథ.

విశ్లేషణ
పరుచూరి మురళి అందించిన కథలో ఏమాత్రం నావెల్టీ లేదు. ఇప్పటికే వెండితెరపై అనేకమార్లు కనిపించి, పులిసిపోయిన పాత కథని, పాత తరహాలోనే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించారు. బాలకృష్ణకూ ఈ కథ కొత్తది కాదు. ఈ తరహా కథలు గతంలోనే ఆయన చేశారు. అయినా ఏం నచ్చి ఆయన ఈ కథకు ఓకే చెప్పారో మనకు బోధపడదు. పోలీసాఫీసర్ ధర్మా వేషంలో కంటే పారిశ్రామికవేత్త అర్జున్ ప్రసాద్‌గా మోడరన్ లుక్‌లోనే ఆయన బాగుండటం విశేషం. ఎమోషనల్ ఎలిమెంట్ ఉన్న ప్రధాన కథకు, హాస్యం కోసం సృష్టించిన అర్జున్ ప్రసాద్, హారిక (సోనాల్ చౌహాన్) మధ్య జరిగే కథ సింక్ కాలేదు. 'నరసింహనాయుడు' సినిమాలో తన ఐడెంటిటీని దాచిన కథానాయకుడు కూడా ఉదాత్తంగానే కనిపిస్తాడు. 'రూలర్'లో ఒక ప్రాజెక్టును చేజిక్కించుకోడానికి బ్యాంకాక్ వెళ్లిన అర్జున్ ప్రసాద్‌కూ, అతడిని బిజినెస్ ఎనిమీగా భావించే హారికకూ మధ్య సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. పైగా హారికకు తోడుగా వెళ్లిన హ్యాకర్స్ బ్యాచ్ రఘుబాబు, ధన్‌రాజ్, రఘు కారుమంచి, హారిక అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డితో చేయించిన ముతక హాస్యం ఎబ్బెట్టు కలిగిస్తుంది. ఆ సన్నివేశాల్లో హారికను కూడా ఒక జోకర్ లాగా చిత్రీకరించారు.

ప్లాట్‌లోనే పెద్ద 'హోల్' ఉన్న విషయం దర్శకుడికీ, హీరోకీ తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఒక కార్పొరేట్ కంపెనీ యజమాని కొడుకుగా వేరెవరో వచ్చి చలామణీ అవడం సాధ్యమయ్యే పనేనా? తన ఐడెంటిటీని బయటపెట్టకుండా తెలీని ఏ ప్రాంతానికో పోయి ఉండటం వేరు, అందరికీ తెలిసిన మహానగరంలో ఒక కంపెనీ చైర్మన్‌గా వ్యవహరించడం వేరు. ప్రపంచానికంతటికీ సరోజినీనాయుడు కొడుకు ఎలా ఉంటాడో తెలియదా? చనిపోయిన ఆమె కొడుకు అర్జున్ ప్రసాద్ స్థానంలో ధర్మా అనే మరో వ్యక్తి వస్తే అందరూ కిమ్మనకుండా సరే అని తలలూపుతారా? మనం ఏ కాలంలో ఉన్నాం? ఇదెక్కడి చోద్యం? మన సినిమాల్లోనే సాధ్యమయ్యే చోద్యమని సరిపెట్టుకోవాలన్న మాట.

ధర్మాకు చెందిన ప్రధాన కథలో ఉత్తరప్రదేశ్‌లో జమీందార్ల లాగా బతికే ఠాకూర్ల ఫ్యామిలీని చూపించారు. ఆ ఫ్యామిలీ పెద్ద అయిన వ్యవసాయ శాఖామంత్రి వీరేంద్రనాథ్ ఠాగూర్ (ప్రకాశ్ రాజ్) ఆశయం మేరకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన రైతులు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడి 5 వేల ఎకరాల బీడుభూమిని సాగుచేసి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారు. 30 ఏళ్ల తర్వాత ఆ భూములు ఆ రైతుల పరం అవుతాయనేది జీవో. వీరేంద్రనాథ్ ఎంత మంచివాడో అతని తమ్ముడు భవానీనాథ్ అంత క్రూరుడు. అన్న ఆస్తిపై కన్నేసి, అన్న కూతురు నిరంజన్ (భూమిక) వేరే కులంవాడిని పెళ్లిచేసుకుందనే విషయంపై తన కులంవాళ్లను రెచ్చగొట్టి, ఆ ఆస్తినీ, దాంతో పాటు తెలుగు రైతులు సస్యశ్యామలం చేసిన భూమినీ తన పరం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు భవానీనాథ్. కథకు కీలకమైన పాయింట్ ఇదే. బడాబాబులు పేదల భూములపై కన్నేసి, వాటిని స్వాధీనం చేసుకోవాలనే పాయింట్ ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు! ఈ సినిమాలో నేపథ్యాన్ని ఉత్తరప్రదేశ్‌కు మార్చారంతే. తనవాళ్లను, అపాయంలో ఉన్న వీరేంద్రనాథ్, నిరంజన్‌లను కాపాడటానికి ధర్మాచేత పదే పదే రక్తం చిందింపజేశాడు దర్శకుడు. సినిమాలో రక్తం ఎన్నిసార్లు ఏరులై పారుతుందో లెక్కలేదన్నట్లే ఉంటుంది. తెలుగులో ఇప్పటికే మాస్ డైరెక్టర్స్‌గా ముద్రపడి బాలయ్య చేత హిట్ సినిమాలు తీసిన వాళ్ల జాబితాలో తానూ నిలవాలనుకున్నాడేమో.. తన శైలికి విరుద్ధంగా ఆ హింసను నమ్ముకొని కె.ఎస్. రవికుమార్.. ఈ సినిమా తీశాడనిపిస్తుంది. 

కామెడీ కోసం వేదిక, సప్తగిరిపై తీసిన ట్రాక్ అయితే మరీ ఘోరం. ఆ ట్రాక్ హాస్యాన్ని పండించకపోగా, చీదర పుట్టిస్తుంది. అంటే ఈ సినిమాలో హాస్యం కోసం సృష్టించిన సన్నివేశాలన్నీ చవకబారువే. చిరంతన్ భట్ సంగీతం పాటల వరకు బాగానే ఉన్నా, సన్నివేశాలకు వచ్చేసరికి విఫలమైంది. క్లైమాక్స్ చిత్రీకరణ కానీ, దాని నేపథ్య సంగీతం కానీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. లౌడ్ సౌండ్‌తో క్లైమాక్స్ బీభత్సంగా తోస్తుంది. ఈ కథకు 'రూలర్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు.

ప్లస్ పాయింట్స్
బాలకృష్ణ అభినయం, డాన్సులు
భూమిక ఎపిసోడ్
పాటలు, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
మూస కథా కథనాలు
మితిమీరిన హింస, రక్తపాతపు సన్నివేశాలు
చవకబారు హాస్యం
లౌడ్‌గా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్

నటీనటుల అభినయం
ధర్మా, అర్జున్ ప్రసాద్ అనే రెండు ఐడెంటిటీలు ఉన్న క్యారెక్టర్‌ను తనకు అలావాటైన ధోరణిలో అనాయసంగా చేసుకుపోయారు బాలకృష్ణ. అల్ట్రా మోడరన్ అర్జున్ ప్రసాద్ ఆహార్యంలోనూ ఆయన ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ధర్మా రోల్‌లో ఆయన హెయిర్ స్టైల్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. హావభావాల ప్రదర్శన విషయంలో ఆయన ఏ స్థాయి నటుడో చెప్పాల్సిన పనిలేదు కదా. కాకపోతే ఆయన చేత అసందర్భంగా పొడవాటి డైలాగ్స్ చెప్పించడం బాగాలేదు. హుషారుగా, కొత్త తరహా స్టెప్పులతో ఆయన అలరించారు. యాక్షన్ సన్నివేశాల్లో తానింకా యువకుడినే అన్నట్లు రెచ్చిపోయి చేశారు కానీ, ఆ రకం ఫైట్లు అనవసరం అనిపిస్తుంది. బాలకృష్ణ అంటే ఆమాత్రం రక్తపాతం, హింస ఉండాలన్నట్లే వాటిని డిజైన్ చేశారు. క్లోజింగ్ సీన్‌లో క్లోజప్‌లో ఆయన వయసు బాగా తెలుస్తోంది. హీరోయిన్లు వేదిక, సోనాల్‌లకు పెద్దగా నటించడానికి ఆస్కారం కలగలేదు. వేదికను పిచ్చిదానిలా చూపించాల్సిన అవసరం లేదు. సోనాల్‌లోని గ్లామర్ యాంగిల్‌ను బాగా ఉపయోగించుకున్నారు. జయసుధ, సాయాజీ షిండే, భూమిక, నాగినీడు, ఝాన్సీ పాత్రల పరిధి మేరకు నటించారు. భూమిక తండ్రిగా, నిజాయితీపరుడైన ఠాకూర్‌గా ప్రకాశ్ రాజ్ ఎప్పటిలా రాణించారు. పరమ కిరాతకుడైన భవానీనాథ్ ఠాగూర్‌గా బెంగాలీ నటుడు షతాఫ్ ఫిగర్ పర్ఫెక్టుగా సరిపోయాడు. హాస్య నటులు రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ధన్‌రాజ్, రఘు కారుమంచి తమకు ఇచ్చిన పాత్రల్ని తమకు అలవాటైన తరహాలో చేశారు కానీ, వాళ్లకు కల్పించిన సన్నివేశాలు నేలబారువి కావడం వల్ల అలరించలేకపోయారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
'రూలర్' అనే టైటిల్‌కూ, కథకూ సంబంధం లేదు. విపరీతమైన హింస, రక్తపాతం, చవకబారు హాస్యం, పాచిపోయిన తరహాలోనే సాగిన కథా కథనాలు, మూస పాత్రలతో నిండిన 'రూలర్' చూస్తే, హృదయంపై ఏదో బరువైన వస్తువేదో పడ్డ అనుభూతి కలుగుతుంది.

రేటింగ్: 2.25/5

- బుద్ధి యజ్ఞమూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.