'మెగాసూపర్' ఈవెంట్.. ఒకే వేదికపై మెగాస్టార్, సూపర్‌స్టార్!
on Dec 20, 2019

సూపర్ స్టార్ సినిమా ఈవెంట్‌కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్! అవును. జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్న 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఎవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. గురువారమే ఈ అప్‌డేట్‌కు సంబంధించిన ఫీలర్‌ను ఇచ్చారు నిర్మాతలు. "దిస్ ఒన్ విల్ బి ఎపిక్. రేపు సాయంత్రం 5:04 గంటలకు వచ్చే ల్యాండ్‌మార్క్ అనౌన్స్‌మెంట్ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తుండండి" అని ప్రకటించారు. ఈ రోజు ఆ 'లాండ్‌మార్క్' అనౌన్స్‌మెంట్ ఏమిటో చెప్పారన్న మాట. మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి కనిపించబోయే ఈ ఈవెంట్‌ను 'ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ 2020'గా ఆ సంస్థ అభివర్ణించింది. నిజానికి రెండు నెలల క్రితమే ఆ ఇద్దరూ ఒక ఈవెంట్‌లో మెరిశారు. అది టాలీవుడ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ నిర్వహించిన 'సినీ మహోత్సవం'లో ఆ ఇద్దరూ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మూడు నెలల విరామంతో ఆ ఇద్దరూ ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఒకే స్టేజిని పంచుకోనున్నారు. అందులో మహేశ్ గురించీ, అతని సినిమా గురించీ మెగాస్టార్ ప్రశంసించనుండగా, తాను మెగాస్టార్ అభిమానినని చెప్పేందుకు మహేశ్ ఎదురు చూస్తున్నాడు. గతంలోనే టాలీవుడ్‌లో చిరంజీవే చివరి మెగాస్టార్ అని మహేశ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం.
చిరంజీవి రాక గురించి మహేశ్ సైతం సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించాడు. "డియర్ చిరంజీవి గారూ.. 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావడానికి అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మా సెలబ్రేషన్స్‌లో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌ను మా 'సరిలేరు నీకెవ్వరు' బృందం నిజంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను సార్" అని పోస్ట్ చేశాడు మహేశ్. అయితే చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటాన్ని 'ల్యాండ్‌మార్క్ అనౌన్స్‌మెంట్'గా ప్రస్తావించడం కొంతమంది మహేశ్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే వాళ్లు ఈ అనౌన్స్‌మెంట్‌పై ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. "ఇదేనా మీరన్న ల్యాండ్‌మార్క్ అనౌన్స్‌మెంట్" అంటూ ట్రోల్ చేయడంతో ఆ కామెంట్స్‌ను హైడ్ చేశారు.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో మహేశ్ జోడీగా రష్మికా మందన్న నాయికగా నటిస్తోంది. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



