ENGLISH | TELUGU  

ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

on Dec 20, 2019

నటీనటులు: సాయి తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, సీనియర్ నరేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జయకుమార్
సంగీతం: ఎస్. తమన్
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
సమర్పణ: అల్లు అరవింద్ 
నిర్మాత: 'బన్నీ' వాస్
కథ-మాటలు- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 20 డిసెంబర్ 2019

'చిత్రలహరి' విజయం తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. మతి మరుపు కాన్సెప్ట్‌తో 'భలే భలే మగాడివోయ్', ఓసీడీ కాన్సెప్ట్‌తో 'మహానుభావుడు' తీసి ప్రేక్షకులకు వినోదాన్ని పుష్కలంగా పంచిన దర్శకుడు మారుతి... ఈసారి చావును తీసుకున్నాడు. మరణం తథ్యమని అందరికీ తెలుసు. మనకు కావలసినవాళ్లు మరికొన్ని రోజుల్లో మనల్ని వీడి వెళతారని తెలిసిన తర్వాత వాళ్లకు సంతోషంగా వీడ్కోలు పలకాలనే కాన్సెప్ట్‌తో 'ప్రతిరోజూ పండగే' తీశాడు. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదవండి.  

కథ: 
సాయి (సాయి తేజ్) అంటే అతడి తండ్రి (రావు రమేష్) కి ఎంతో ప్రేమ. కొడుకుపై అంత ప్రేమ చూపించే అతడిలో... తండ్రి (సత్యరాజ్) లంగ్ క్యాన్సర్ వల్ల మరో ఐదు వారాల్లో చనిపోతాడని తెలిసిన ఎటువంటి చలనం ఉండదు. రెండు వారాలు ఆగి... ఇండియాలో తండ్రి దగ్గరకు వెళదామని అనుకుంటాడు. విషయం తెలిసిన సాయి... వెంటనే బయలుదేరి తాతయ్య దగ్గరికి వస్తాడు. తాతయ్య చివరి రోజుల్లో ఆయనకు సంతోషం కలిగించే పనులు చేయాలని నిర్ణయించుకుంటాడు. సాయి ఏం చేశాడు? ఏం జరిగింది? అనేది సినిమా.

విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో ఇదొక మామూలు కథ, మనందరి కథ అని దర్శకుడు మారుతి చెబుతాడు. నిజమే... ఈ కథ మన అందరిదీ. ఉద్యోగాలు, ఆఫీసులు, కుటుంబ బాధ్యతల్లో పడి వృద్ధాప్యం లోకి వచ్చిన తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేని ప్రతి ఒక్కరి కథ. మన కథను మళ్లీ మనకు చెబుతున్నప్పుడు కథనం పకడ్బందీగా ఉండాలి. ప్రతి భావోద్వేగం ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా ఉండాలి. ఈ చిత్రంలో అదే కొరవడింది. కథ ఏంటి అనేది సినిమా మొదలైన పదినిమిషాలకే మారుతి చెప్పేశాడు. అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్లడానికి తనకు పట్టున్న వినోదం మీద ఆధారపడ్డారు. ఆ వినోదం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. కానీ, వినోదం మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునేలా లేవు. పతాక సన్నివేశాల్లో మాత్రమే ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. మాటల్లోని తీవ్రత తెరపైకి తీసుకురావడంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. దీనికి తోడు అసలు కథలోని ఉపకథలుగా వచ్చిన తాతయ్య సత్యరాజ్  స్నేహితుల ఎపిసోడ్, తండ్రి రావు రమేష్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వడంతోపాటు అతని కుమారుడు సాయికి పిల్లని ఇవ్వాలనుకునే మురళీశర్మ ఎపిసోడ్ నిడివి పెంచాయి తప్ప కథలో ఎటువంటి ప్రభావాన్ని చూపలేక పోయాయి. సెకండాఫ్ లో వచ్చే పాటలు కూడా కథకు అడ్డుతగిలాయి. ఫస్టాఫ్ లో పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
సాయి తేజ్ నటన
రావు రమేష్ క్యారెక్టరైజేషన్, నటన
కామెడీ సీన్స్
ఎమోషనల్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్:
మామూలు కథ
అసలు కథలో ఉపకథలు
సెకండాఫ్ లో పాటలు
స్క్రీన్ ప్లే
చిన్న పాయింట్ ను సాగదీశాడు

నటీనటుల అభినయం: 
ఈ సినిమాలో అసలైన హీరో ఎవరంటే రావు రమేష్ అని చెప్పాలి. దర్శకుడు మారుతి అతడికి అద్భుతమైన క్యారెక్టరైజేషన్ రాస్తే... అందులో రావు రమేష్ జీవించేశారు. కొద్ది రోజుల్లో తండ్రి చనిపోతాడని తెలిసి చలనం లేని కొడుకును చూస్తే ఎవరికైనా కోపం రావాలి. కానీ, రావు రమేష్ క్యారెక్టర్ చూసి అతడు ఇంతే అని ప్రేక్షకులు అనుకుంటారు. రావు రమేష్ ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తారు. క్యారెక్టరైజేషన్ కుదరడంతో ఈ సినిమాలో కామెడీ కూడా చింపేశారు. ముఖ్యంగా సెకండాఫ్ లో మంచి టైమింగ్ లో అతడు డైలాగులు చెబుతుంటే... ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరు. తాతయ్యను ప్రేమించే మనవడిగా సాయి తేజ్ చక్కటి నటన కనబరిచాడు. కథంతా హీరో చుట్టూ తిరగాలి అని ఆలోచించకుండా... కథలో ‌ తాను ఒక పాత్రగా చక్కగా చేశాడు. పతాక సన్నివేశాల్లో సాయి తేజ్ నటన పవన్ కళ్యాణ్ ను గుర్తు చేస్తుంది. పవన్ ని ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది. ‌ తాతయ్య పాత్రలో సత్యరాజ్ పర్వాలేదనిపించారు. ఏంజెల్ ఆర్న పాత్రలో రాశీ ఖన్నా నటన ఆకట్టుకుంటుంది. అమాయకపు అమ్మాయిగా నవ్విస్తుంది. అదే సమయంలో ఆమెపై ప్రేమ పుట్టేలా చేస్తుంది. సాయి తేజ్, రాశీ ఖన్నా మధ్య సన్నివేశాలు బాగున్నాయి. చాలా రోజుల తర్వాత విజయ్ కుమార్ తెలుగు తెరపై కనిపించారు. మిగతా నటీనటులందరూ పాత్రకి తగ్గట్టు చేశారు‌. ‌  

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఓరోజు సంతోషంగా నవ్వుకోడానికి ఈ సినిమా చక్కటి ఆప్షన్. అంతకు మించి భావోద్వేగాలను ఆశిస్తే.. డిజప్పాయింట్ అవుతారు. సున్నితమైన అంశంతో మారుతి చక్కటి వినోదాన్ని పండించారు‌. చివరలో చిన్న సందేశం కూడా ఇచ్చారు.

రేటింగ్: 2.75/5


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.