ENGLISH | TELUGU  

రివ్యూ: రోగ్‌

on Mar 31, 2017

సిగరెట్ ఎందుకు తాగుతారు అని అంటే తాగేవాళ్లు ఎవరూ కూడా సంతృప్తికరమైన సమాధానం చెప్పలేరు. అది మంచిదా చెడ్డాదా అన్నది పక్కన పెడితే తాగకుండా వుండనూ లేరు. దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమాలు కూడా ఇలాంటివే. హానికరమో,  కాదో కానీ, చూడకుండా అయితే వుండలేరు. అందుకే ఆయన సినిమాలు ఫిక్స్ డ్ ఆడియన్స్ ఎప్పుడూ వుంటారు. అందుకే నిర్మాతలు రెడీ, హీరోల డేట్లు రెడీ. అలా అని పూరి జగన్నాధ్ తగిన జాగ్రత్తలేమీ తీసుకోరు. తన దారి తనదే. అలాంటి దారిలో వచ్చిన మరో సినిమా రోగ్. కొత్త కథానాయకుడు ఇషాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు మరో చంటిగాడి ప్రేమకథ అన్నది టాగ్ లైన్.

* క‌థ‌

ఇక్కడ హీరో పేరు చంటి (ఇషాన్)నే. ఓ పోలీస్ కమిషనర్ కూతురు అంజలి (ఎంజెలా) ని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి హ్యాండిస్తుంది. దీంతో పోలీసులతో గొడవపడి రెండేళ్లు జైల్లో వుంటాడు. బయటకు వచ్చాక, తన వల్ల గాయపడి, ఆదాయం లేకుండా పోయిన పోలీస్ (సత్య) కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వెళ్తాడు. ఆ పోలీస్ చెల్లెలు అంజలి (మన్నారా చోప్రా) చంటిని ఇష్టపడడం ప్రారంభిస్తుంది. కానీ అంతలోనే ఓ సైకో (ఠాకూర్ అనూప్ సింగ్) ఆమె వెంటపడతాడు. దీంతో చంటికి సైకోకి మధ్య క్లాష్. చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

* విశ్లేష‌ణ‌

కలకత్తా నేపథ్యంలోనే జరుగుతుంది మొత్తం సినిమా అంతా. రెండు గంటలకు పైగా సినిమా అయినా  కథ ఆవగింజంతే. దీన్నే పూరి తన మార్కుతో రెండుగంటల సినిమాగా మార్చారు. పూరి చమక్కులు కనుక లేనట్లయితే, అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకోనక్కరలేదు. అందుకంటే విషయం లేకుండా రెండు గంటలు కూర్చోవడం కష్టం కనుక. కానీ పూరి మార్కు సీన్లు, పూరి మార్కు క్యారెక్టర్లు, పూరి మార్కు డైలాగులు కలిసి ప్రేక్షకుడిని పెద్దగా ఇబ్బంది పడకుండానే రెండు గంటలు కూర్చునేలా చేస్తాయి.

సినిమా తొలిసగం అంతా చకచగా సాగిపోతుంది. ఎందుకంటే హీరో, హీరోయిన్, మరో హీరోయిన్, విలన్ వీళ్లందరి పరిచయంతోనే తొలిసగం పూర్తయిపోతుంది. అందువల్ల పెద్దగా అనుకోవడానికి ఏమీ వుండదు. సినిమా ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, వేరే రూట్ లోకి మారుతుంది. అక్కడి నుంచి హీరోకి ఒకటే పని. రెండో హీరోయిన్ ను సైకో బారి నుంచి కాపాడడం. హీరోతో సమానంగా సైకో విలన్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. ఇది ఒక తరహా ప్రేక్షకులకు నచ్చుతుంది. టోటల్ గా చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను పూర్తిగా పక్కన పెట్టే సినిమా తీసారు. పూరి మార్కు డయిలాగులు కానీ, సీన్లు కానీ, అమ్మాయిల అందాలపై కెమేరా పనితనం కానీ, ఇవన్నీ కేవలం కుర్రకారు ఆఢియన్స్ ను టార్గెట్ చేసి తప్ప వేరు కాదు.

సినిమా మలిసగంలొని చివరి అర్థగంటలో దర్శకుడు కాస్త దారి తప్పాడు. ఏదేదో చేసాడు. ఇవన్నీ సైకో వ్యవహారాలను ఎలివేట్ చేసేవి తప్ప హీరోను కాదు. దాంతో ప్రేక్షకుడికి కూడా సినిమా ఎటో వెళ్తోందన్న భావన కలుగుతుంది. పైగా రెండో హీరోయిన్ పాత్రను సరిగ్గా మలచడంలో, ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కామెడీ ట్రాక్ ల కోసం చేసుకున్నవి మరీ అద్భుతాలేమీ ఇవ్వలేదు. జస్ట్ ఓకె అంతే.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఇలాంటి సినిమాకు వున్న ప్లస్ ల్లో కీలకమైనది హీరో ఇషాన్ కూడా. ఇషాన్ నటనలో, ఫైట్లలో మాంచి ఈజ్ వుంది. ఎక్కడా వేలు పెట్టి ఎంచడానికి లేదు. ఓ హీరో తన తొలి పరిచయంలో, తనుకు ఇచ్చిన ఇలాంటి పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఫైట్లు బాగా చేసాడు. లుక్స్ బాగున్నాయి. ఏంజెలా కొద్ది సేపయినా అందాలు బాగానే అందించింది. మన్నారా ఒకె. విలన్ కాస్త అతి చేసాడనిపిస్తుంది. కానీ సైకో కదా అని సరిపెట్టుకోవాలి.

* సాంకేతిక వ‌ర్గం

సాంకేతికంగా సినిమా ఓకె. కలకత్తా నేఫధ్యం, సినిమాటోగ్రఫీ కలిసి కొత్త లుక్ తీసుకువచ్చాయి. లోకేషన్స్ అన్నీ ఫ్రెష్ గా వున్నాయి. సునీల్ కాశ్యప్ సంగీతంలో పాటలు అక్కడ వినకానికి బాగున్నాయి కానీ, సిట్యువేషన్ కు తగిన ట్యూన్లు కాదనపిస్తుంది. దర్శకుడిగా కన్నా డైలాగ్ రైటర్ గా పూరి ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు. తన స్టయిల్ డైలాగులు బాగా పేల్చాడు. కుర్రాళ్లు జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలంటే చూడొచ్చు అని చెప్పే సినిమాగా రోగ్ మిగుల్తుంది.

లాస్ట్ పంచ్ :  రోగ్‌.. ఇది పూరి మార్క్ సినిమా


రేటింగ్‌: 2


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.