ENGLISH | TELUGU  

గురు మూవీ రివ్యూ

on Mar 31, 2017


స్పోర్ట్స్ డ్రామా లంటే మ‌న‌కు పెద్ద‌గా గిట్ట‌దు. క్రికెట్ త‌ప్ప‌... ఏదీ మ‌న దృష్టిలో ఆట కాన‌ట్టే. మ‌హా అయితే క‌బ‌డ్డీ నేప‌థ్యంలో సినిమాలు తీస్తారు. దాంట్లోనూ హీరోయిజం, ల‌వ్‌, ట్విస్టులూ... ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ ఉండేట్టు జాగ్ర‌త్త ప‌డ‌తారు. దాంతో 'ఆట‌..'కాస్తా... 'ఆట‌'లో అర‌టి పండు అయిపోతుంది.  ఈ విష‌యంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుల్ని, నిర్మాత‌ల్నీ మెచ్చుకొని తీరాలి. అక్క‌డ స్పోర్ట్స్ నేప‌థ్యంలో చాలా సినిమాలొస్తున్నాయి. వ‌చ్చిన ప్ర‌తీ సినిమా ఆడుతోంది. వాళ్ల క‌థ‌ల్లో స్పోర్ట్స్ మాత్ర‌మే ఉంటుంది. ఎమోష‌న్ ఉంటుంది. దేశ‌భ‌క్తి అనే ఫీల్ క‌లుగుతుంది. ఈ ల‌క్ష‌ణాలన్నీ బాలీవుడ్ సినిమా 'సాలా ఖ‌డూస్‌'లో క‌నిపించాయి. ఈ సినిమా తీసింది తెలుగ‌మ్మాయే!  ఇప్పుడు త‌నే... 'సాలాఖ‌డూస్ని' 'గురు' పేరుతో రీమేక్ చేసింది.  మ‌రి బాలీవుడ్‌లో చేసిన మ్యాజిక్ తెలుగులోనూ వ‌ర్క‌వుట్ అవుతుందా??   'గురు'గా వెంకీకి ఎన్ని మార్కులు ప‌డ‌తాయి??   చూద్దాం... రండి.

* క‌థ‌

ఆదిత్య (వెంక‌టేష్‌) బాక్సింగ్ కోచ్‌. అకాడ‌మి బాస్ (దేవ్‌) కి ఆదిత్య అంటే అస్స‌లు ప‌డ‌దు. అందుకే ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖ‌ప‌ట్నం కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అక్క‌డ అమ్మాయిల  కోచ్‌గా జాయిన్ అవుతాడు. రాములు (రితికా సింగ్‌) కూర‌గాయ‌లు అమ్ముకొంటుంటుంది. త‌న‌లో బాక్సింగ్ నైపుణ్యాన్ని గుర్తిస్తాడు ఆది. రోజుకి రూ.500 ల కూలీ కోసం అకాడ‌మీలో చేరుతుంది రాములు.  త‌న‌కు బాక్సింగ్ అంటే ఇష్ట‌మే గానీ... ఆదిని మాత్రం ఎప్పుడూ చిన్న చూపు చూస్తుంటుంది. తిప్ప‌లు పెడుతుంటుంది. కావాల‌నే కొన్ని కీల‌క‌మైన మ్యాచ్‌లు ఓడిపోతుంది. దాంతో... రాములుని అస‌హ్యించుకొని అకాడ‌మి నుంచి గెంటేస్తాడు ఆది. ఆఖ‌రికి ఆది మంచిత‌నాన్నీ, నిజాయ‌తీని రాములు ఎలా గుర్తించింది??  అకాడ‌మీలో చోటు ఎలా ద‌క్కించుకొంది?  దేశానికి ప‌తకం తీసుకురావాల‌ని త‌పించే ఓ గురు... త‌న శిష్యురాల్ని ఎలా ఛాంపియ‌న్‌గా మార్చాడు? అనేదే మిగిలిన క‌థ‌.

* విశ్లేష‌ణ‌

రీమేక్ సినిమాలు తీయ‌డంలో రెండు ప‌ద్ధ‌తులుంటాయి. మాతృక‌లోని ప్ల‌స్‌లు పెంచుకొంటూ, మైన‌స్‌లు త‌గ్గించుకొంటూ, మ‌న‌వైన మార్పులు చేసుకొంటూ తీయ‌డం ఒక ప‌ద్ధ‌తి. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీసేయం మ‌రో ప‌ద్ధ‌తి. మాతృక తీసిందీ, రీమేక్ చేసింది వేర్వేరు ద‌ర్శ‌కుల‌తైతే మార్పులూ, చేర్పులూ చూసే అవ‌కాశం ఉంటుంది. ఒక్కో ద‌ర్శ‌కుడికీ ఒక్కో శైలి ఉంటుంది కాబ‌ట్టి.. రీమేక్‌లో ఆ మార్పు త‌ప్ప‌కుండా క‌నిపిస్తుంది. అయితే... `గురు`కి ఆ అవ‌కాశం లేదు. ఎందుకంటే హిందీలో తెర‌కెక్కించిన సుధా కొంగ‌ర‌నే రీమేక్ బాధ్య‌తా తీసుకొంది. త‌న సొంత క‌థ కాబ‌ట్టి, హిందీలో తీసింది తానే కాబ‌ట్టి... క‌థ‌లో ఆమెకు పెద్ద‌గా లోపాలు క‌నిపించ‌క‌పోవొచ్చు. దాంతో పాటు...క‌థ‌ని న‌డిపించిన శైలి కూడా ఏం మార‌లేదు. హిందీ సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు.. 'గురు'లో కొత్త విష‌యాలేం క‌నిపించ‌వు. మాధ‌వ‌న్ స్థానంలో వెంకీ ఉంటాడంతే. అంత‌కు మించిన మార్పులేం  ఉండ‌వు.


స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో సాగే సినిమాల ఫార్మెట్ అంతా ఒకేలా ఉంటుంది. క‌ఠోర‌మైన శిక్ష‌ణ‌, ఆ త‌ర‌వాత ఓట‌మి... మ‌ళ్లీ గెలుపు.. క్లైమాక్స్‌లో భ‌యంక‌ర‌మైన ప్ర‌త్య‌ర్థి.. త‌న చేతిలో చావు దెబ్బ‌లు తిన‌డం.. మ‌ళ్లీ పుంజుకొని గెల‌వ‌డం - ఇదే డ్రామా!  ఈమ‌ధ్య వ‌చ్చిన 'మేరీ కోమ్‌', 'దంగ‌ల్', 'సుల్తాన్ల‌'లో క‌నిపించింది ఇదే. `గురు`లోనూ అదే రిపీట్ అయ్యింది. దాంతో ఆల్రెడీ ఖాన్‌ల సినిమాలు చూసేసిన ప్రేక్ష‌కుల‌కు ఇదేం కంటికి ఆన‌క పోవొచ్చు.  అయితే తెలుగులో పూర్తిగా స్పోర్ట్స్ నేప‌థ్యంలో న‌డిచిన సినిమా ఇదే. ఎక్క‌డా క‌మ‌ర్షియాలిటీ (ఒక్క మందు పాట త‌ప్ప‌)కి లొంగ‌లేదు. బాక్సింగ్ త‌ప్ప ఇంకేం చూపించ‌లేదు.  ఆ విష‌యంలో చిత్ర‌బృందాన్ని మెచ్చుకొని తీరాలి.  శిష్యురాల్ని ఛాంపియ‌న్‌గా మార్చ‌డానికి ఓ గురువు ప‌డే త‌ప‌న‌, చేసిన త్యాగాలు త‌ప్ప‌కుండా ర‌క్తి క‌ట్టిస్తాయి. వాటికి సంబంధించిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకొంటాయి. రితిక పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం కూడా అంద‌రికీ న‌చ్చుతుంది.

 

ఓ ద‌శ‌లో ఆ పాత్ర‌పై కోపం కూడా వ‌స్తుంది. అయితే.. అదంతా `డ్రామా`లో భాగం. ఓ పాత్ర‌పై కోపం, ప్రేమ పెరిగాయంటే.. ఆ పాత్ర‌ని తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కులు స‌ఫ‌లం అయ్యార‌నే. ఆ విష‌యంలో సుధాకొంగ‌ర‌కి పూర్తి మార్కులు ప‌డ‌తాయి.  ద్వితీయార్థం కాస్త నెమ్మ‌దించింది. అయితే ఇలాంటి సినిమాల‌కు ఈ త‌ర‌హా కంప్లైంట్లు మామూలే. ప‌తాక స‌న్నివేశాల్లో ఎమోష‌న్‌కే కీల‌క పాత్ర‌. ఈ క‌థ ఎక్క‌డ ఎలా ముగుస్తుందో మ‌నం తేలిగ్గా ఊహించ‌గ‌లం (సాలా ఖ‌డూస్ చూడ‌క‌పోయినా).  కానీ... అప్ప‌టి వ‌ర‌కూ కూర్చోబెట్ట‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. స్పోర్ట్స్ డ్రామాల‌న్నీ ఒకేలా మొద‌లై.... ఒకేలా ముగుస్తాయి. ఆ లెక్క‌న 'గురు'లోనూ కొత్త‌గా ఏం అనిపించ‌క‌పోవొచ్చు. కానీ భావోద్వేగాల్ని పంచ‌డంలో మాత్రం `గురు` విజ‌య‌వంత‌మ‌య్యాడు.


*  న‌టీన‌టుల ప్ర‌తిభ‌

వెంక‌టేష్‌ని ఈ త‌ర‌హా పాత్ర‌లు కొట్టిన పిండే. అయితే.... ఈసారి మాత్రం కాస్త క‌స‌ర‌త్తు చేశాడు. త‌న బాడీ లాంగ్వేజ్‌, మాట తీరు కాస్త మారాయి. భావోద్వేగ భ‌రిత స‌న్నివేశాల్లో ఎప్ప‌ట్లా ఆక‌ట్టుకొన్నాడు. అయితే వెంకీ క‌న్నా ఎక్కువ మార్కులు రితికా సింగ్‌కి ద‌క్కుతాయి. ఆమె పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. తాను త‌ప్ప ఈ పాత్ర‌ని ఇంకెవ్వరూ చేయ‌లేరేమో అనే స్థాయిలో న‌టించి ర‌క్తి క‌ట్టించింది. భ‌ర‌ణి క‌నిపించింది కాసేపే. త‌మిళంలోనూ, హిందీలోనూ తాను చేసిన పాత్ర‌నే మ‌ళ్లీ చేశాడు నాజ‌ర్‌. కాబ‌ట్టి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేకుండా పోయింది. మిగిలిన‌వ‌న్నీ చిన్న చిన్న పాత్ర‌లే.


* సాంకేతిక వ‌ర్గం

టెక్నిక‌ల్‌గా ఈ సినిమా చాలా బాగుంది. మ‌రీ ముఖ్యంగా సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం ఆక‌ట్టుకొంటుంది. వెంకీ పాడిన పాట‌... ఫ్యాన్స్‌కి న‌చ్చుతుంది. నేప‌థ్య సంగీతం కూడా. కొన్ని హిందీ షాట్స్‌ని య‌ధాత‌ధంగా వాడుకొన్నారు. దాంతో బ‌డ్జెట్ కంట్రోల్‌లోకి తెచ్చుకొన్నారు. ద‌ర్శ‌కురాలి క‌ష్ట‌మంతా బాలీవుడ్ సినిమా వ‌ర‌కే. ఎందుకంటే అప్పుడు రాసుకొన్న స్క్రిప్ట్, తీసిన సీన్స్‌... మ‌ళ్లీ ఓసారి తీసిందంతే.


* ఫైన‌ల్ ట‌చ్‌:   మ‌క్కీకి మ‌క్కీ దించేశావ్ గురూ...!


రేటింగ్: 3

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.