దిగొచ్చిన దిల్ రాజు.. అప్పటి టికెట్ ధరలతో 'థాంక్యూ'!
on Jul 18, 2022

వరుస షాక్ లతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దిగొస్తున్నారు. అధిక టికెట్ ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మానేసి, ఓటీటీకి ఓటేస్తున్నారన్న విషయం గ్రహించి.. ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో టికెట్ ధరలు పెద్ద సినిమాలకు రూ.300-400, చిన్న సినిమాలకు రూ.200-300 ఉండటంతో.. ఇంతింత ఖర్చు పెట్టి థియేటర్ లో చూసే కంటే, కొద్ది రోజులు ఆగి ఓటీటీలో చూడటం ఉత్తమమని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులు థియేటర్స్ కి రాక కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. దీంతో బాగా చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్.
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'థాంక్యూ'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య తాను నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలను అధిక ధరలకు విడుదల చేసిన ఆయన వరుసగా ఇండస్ట్రీకి వస్తున్న షాక్ లతో.. 'F3' కి మాత్రం కాస్త దిగొచ్చాడు. అయినప్పటికీ ఆ సినిమాకి కూడా లాస్ తప్పలేదు. దీంతో ఇప్పుడు 'థాంక్యూ' కోసం మరింత దిగాలని దిల్ రాజు నిర్ణయించాడు. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడానికంటే ముందున్న ధరలతోనే 'థాంక్యూ'ని రిలీజ్ చేయనున్నారట. అలా చేస్తే హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ లో అధికంగా రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.150 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. వీటికి జీఎస్టీ రూపంలో మరో రూ.10-20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రూ.100-150 టికెట్ రేట్లతో సినిమాలు విడుదల చేయాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా దిగిరాని ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్.. ప్రేక్షకులు థియేటర్స్ రావట్లేదని గ్రహించి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. టికెట్ ధరలు రూ.100-150 ఉంటే థియేటర్స్ ఒకప్పటిలా మళ్ళీ కళకళలాడే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



