నా మీద నెగటివిటీ వస్తుందంటే, జీవితంలో నేనేదో సాధిస్తున్నానని అర్థం!
on Jul 18, 2022

హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల్ని అలరించాడు. తక్కువ బడ్జెట్‌తో తయారైన ఆ సినిమా థియేట్రికల్ రన్ ద్వారానే పెట్టుబడికి రెండింతలు సంపాదించి, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాతలకు బోల్డంత డబ్బులు సంపాదించిపెట్టింది. ఈనెల 16న కిరణ్ బర్త్‌డే సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు, అతడి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ పోస్టర్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అతడిపై పాజిటివ్‌గా వచ్చిన కామెంట్స్‌తో పాటు నెగటివ్‌గా వచ్చిన కామెంట్స్ కూడా ఉన్నాయ్.
నేను మీకు బాగా కావాల్సిన వాడిని, రూల్స్ రంజన్, మీటర్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు అతని చేతిలో ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడు, అతనిది పెద్ద బ్యాగ్రౌండ్ ఏమో, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో.. ఇలాంటి కామెంట్స్ విరివిగా వస్తున్నాయి. దీంతో ఒక ఎమోషనల్ పోస్ట్‌తో ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు కిరణ్.
"బర్త్‌డే విషెస్‌కు అందరికీ థాంక్యూ. ప్రతి దశలోనూ.. అది షార్ట్ ఫిలిమ్స్‌లో కానివ్వండి, ఫీచర్ ఫిలిమ్స్‌లో కానివ్వండి, ప్రేక్షకుల్లో ఒకడిగా నేను ఎదురుచూస్తూ వచ్చిన బ్యానర్ల కింద రాబోతున్న నా తదుపరి సినిమాలకు సంబంధించి కానివ్వండి, మీరు కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞుడనై ఉంటాను." అని సుదీర్ఘ నోట్ ద్వారా తెలిపిన కిరణ్, "నా ఎదుగుదలకు మీ సపోర్ట్ ఒక్కటే నాకు ఇంధనం. మీకు కేవలం థాంక్స్ చెబితే సరిపోదు. ప్రతి ఫిల్మ్‌కు బాగా కష్టపడతాననీ, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి నా బెస్ట్ ఇస్తాననీ మాటిస్తున్నాను." అని చెప్పాడు.
"ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి, బ్యాగ్రౌండ్ ఏంటి, గట్టి సపోర్ట్ ఉందేమో.. ఇలాంటి ప్రశ్నలు అన్నిటికి నా సమాధానం ఒక్కటే, హార్డ్‌వర్క్." అని సమాధానమిచ్చాడు. "క్లాస్‌లో మనకి తక్కువ మార్కులు వచ్చినదానికంటే పక్కనోడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయి అని బాధ, నెగటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగటివిటీ నా మీద వస్తుంది అంటే జీవితంలో నేనేదో పాజిటివ్‌గా సాధిస్తున్నానని అర్థం." అని తన విమర్శకులకు గట్టిగా జవాబిచ్చాడు. "ఏ పని కోసం చాలా సంవత్సరాలు తిరిగానో, ఇప్పుడు ఆ పని నాకు వచ్చినప్పుడు ఇష్టపడి చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీమ్ మెంబర్స్, ఆడియెన్స్ అందరికీ థాంక్యూ సో మచ్." అని తన పోస్ట్‌ను ముగించాడు కిరణ్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



