ENGLISH | TELUGU  

'రంగమార్తాండ' మూవీ రివ్యూ 

on Mar 21, 2023

సినిమా పేరు: రంగమార్తాండ
తారాగణం: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, జయలలిత, తనికెళ్ల భరణి, అలీ రెజా, ప్రభాకర్
సంభాషణలు: ఆకెళ్ల శివప్రసాద్
సాహిత్యం: సీతారామశాస్త్రి, బల్లా విజయ్‌కుమార్, కాసర్ల శ్యాం 
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి
ఎడిటింగ్: పవన్‌కుమర్ విన్నకోట
నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి
దర్శకుడు: కృష్ణవంశీ
బ్యానర్: హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 22 మార్చి 2023

నానా పటేకర్ టైటిల్ రోల్ పోషించగా మహేశ్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన మరాఠీ ఫిల్మ్ 'నటసమ్రాట్' (2016)ను కృష్ణవంశీ తెలుగులో రీమేక్ చేస్తున్నారనే వార్త సుమారు నాలుగేళ్ల క్రితం బయటకు వచ్చినప్పుడు, అభిరుచి కలిగిన సినీ ప్రియులు ఆనందపడ్డారు. దాంతో పాటు కృష్ణవంశీ ఆ మూవీని ఎలా తీస్తారనే కించిత్ సందేహమూ కలిగింది. మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉండి, కరోనా అడ్డంకుల్ని దాటుకొని ఇన్నాళ్లకు మనమందుకు 'నటసమ్రాట్' తెలుగు రూపం 'రంగమార్తాండ' వచ్చేసింది. థియేటర్లలో విడుదల చేయడానికి వారం రోజుల ముందు నుంచే సన్నిహితులు, హితులైన ఇండస్ట్రీ వ్యక్తులకూ, జర్నలిస్టులకూ కృష్ణవంశీ ఆ సినిమాని చూపిస్తూ వచ్చారు.

కథ
రంగస్థలంపై మహానటునిగా వెలిగిపోయిన రాఘవరావు (ప్రకాశ్ రాజ్)కు రంగమార్తాండ అనే బిరుదునివ్వడంతో పాటు, స్వర్ణ కంకణం తొడుగుతారు ఒక సభలో. అక్కడే తానిక నటునిగా రిటైర్ అయ్యి, తన కుటుంబంతో కలిసి విశ్రాంత జీవితం గడపబోతున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు రాఘవరావు. తన ఇంటిని కోడలు గీత (అనసూయ) పేరిట రాసిచ్చిన ఆయన, బంగారు ఆభరణాలు, బ్యాంక్‌లో ఉండే డబ్బును కూతురు శ్రీదేవి (శివాత్మిక)కి ఇచ్చేస్తాడు. తమకంటూ ఏదైనా మిగిల్చుకుంటే బాగుంటుందని భార్య (రమ్యకృష్ణ) చెప్పినా, తేలిగ్గా తీసేసి పిల్లలే తమను చూసుకుంటారని అంటాడు. భార్యను అభిమానంగా ఆయన రాజుగారూ అని పిలుచుకుంటాడు. రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) అనే పాప్ సింగర్‌ను శ్రీదేవి ప్రేమించిందని తెలిసి, మొదట కాదన్నా అనుంగు మిత్రుడు చక్రపాణి (బ్రహ్మానందం) నచ్చచెప్పడంతో ఆ ఇద్దరికీ పెళ్లి చేస్తాడు రాఘవరావు. భర్తతో కలిసి వెళ్లిపోతుంది శ్రీదేవి. మొదట్నుంచీ ముక్కుసూటి మనస్తత్వం కలిగిన రాఘవరావు ప్రవర్తన కోడలు గీతకు నచ్చకపోవడంతో మనస్పర్ధలు మొదలవుతాయి. రాఘవరావు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని కొడుకు రంగారావు (ఆదర్శ్ బాలకృష్ణ), కోడలు గీత నిర్ణయించుకోవడంతో అక్కడి నుంచి కూతురు ఇంటికి మకాం మారుస్తారు రాఘవరావు దంపతులు. అక్కడ కూడా అతని ప్రవర్తన శ్రీదేవికి కష్టం కలిగిస్తుంది. అల్లుడు రాహుల్ మామగారికి సపోర్ట్ చేసినా, భార్యకు ఎదురుచెప్పలేడు. భర్త మీద శ్రీదేవి డబ్బు దొంగతనం అంటగట్టడంతో రాజుగారు తట్టుకోలేకపోయి, తమ సొంతవూరుకు వెళ్లిపోదామని భర్తతో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రంగమార్తాండునిగా రంగస్థలంపై ఎన్నో పాత్రల్లో చెలరేగిపోయి చేసిన రాఘవరావు నిజ జీవిత నాటకంలో తండ్రి పాత్రను, మామ పాత్రను రక్తికట్టించలేక ఏమయ్యాడు? అనే అంశాలను మిగతా కథలో చూస్తాం.

విశ్లేషణ
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ దగ్గర కూడా విజయ కేతనం ఎగురవేసిన మరాఠీ ఫిల్మ్ 'నటసమ్రాట్‌'లో నానా పటేకర్ నటనను అపూర్వమని అందరూ ఆకాశానికెత్తేశారు. కచ్చితంగా ఆయనకు ఆ ఏడాది బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ వస్తుందని ఆశిస్తే.. 'రుస్తోం' అనే కమర్షియల్ సినిమాలో నటించిన అక్షయ్ కుమార్‌కు ఆ అవార్డునిచ్చి జ్యూరీ అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది కూడా. 'నటసామ్రాట్' మూవీ అదే పేరుతో మరాఠీ రచయిత కుసుమగ్‌రాజ్ రాసిన నాటకం ఆధారంగా రూపొందింది. ఇప్పుడు ఆ సినిమాని ఆధారం చేసుకొని కృష్ణవంశీ 'రంగమార్తాండ'ను తీర్చిదిద్దారు. ఈ సినిమాని ఆయన ఒక రంగస్థల నటుడి విశ్రాంత జీవితం కథగా కాకుండా "ఇది మన అమ్మానాన్నల కథ" అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చారు. బతికి ఉండగానే తమ స్థిర, చరాస్తుల్ని పిల్లలకు వృద్ధులైన తల్లితండ్రులు ఇచ్చేస్తే, ఆ పిల్లలు వారిపట్ల ఎలా ప్రవర్తించారనే అంశాన్ని ఈ మూవీలో ఫోకస్ చేశారు కృష్ణవంశీ. ఈ క్రమంలో ఆయన ఒరిజినల్‌ను యథాతథంగా తియ్యకుండా తనదైన సృజనాత్మకతను అనుసరించారు. 

'రంగమార్తాండ' సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపించే విషయం.. టైటిల్ రోల్ చేసిన ప్రకాశ్‌రాజ్ మాత్రమే కాకుండా ఇంతదాకా హాస్యనటునిగానే మనల్ని అలరిస్తూ వచ్చిన బ్రహ్మానందం సైతం రంగమార్తాండునిగా తెరపై ఊహాతీతంగా ప్రకాశించడం.! చక్రపాణి పాత్రను కృష్ణవంశీ మలచిన విధానం, దాన్ని అత్యద్భుతంగా బ్రహ్మానందం పోషించిన తీరు మనల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా చక్రపాణి హాస్పిటల్ బెడ్‌పై ఉన్నప్పుడు, స్టేజిపై తాము పోషించిన కర్ణ, సుయోధన పాత్రల్ని గుర్తుకు తెచ్చుకుంటూ చక్రపాణి, రాఘవరావు చెప్పే డైలాగ్స్ సీన్‌ను గొప్పగా తీశారు కృష్ణవంశీ (ఒరిజినల్‌లో కర్ణ, కృష్ణ పాత్రల డైలాగ్స్ ఉంటాయి). 

సినిమాలో రంగమార్తాండ రంగస్థలంపై చేసిన పాత్రలను మనకు చూపించరు. సందర్భానుసారం ఏయే పాత్రల్ని ఆయన పోషించాడో, వాటిని ప్రస్తావిస్తూ పోతారంతే. మనవరాలిని తెలుగులో మాట్లాడిందనే నెపంతో స్కూల్ ప్రిన్సిపాల్ కాళ్లకు చెప్పులు లేకుండా మిట్టమధ్యాహ్నం ఎండలో నిలబెడితే, అప్పుడే స్కూలుకు వచ్చిన రాఘవరావు ప్రిన్సిపాల్‌ను తిట్టి, తెలుగు (మాతృభాష) గురించి ఉన్నతంగా మాట్లాడి, మనవరాలిని తనతో తీసుకుపోయే సీన్, అదే స్కూల్లో మనవరాలితో ఓ అసభ్యకరమైన తెలుగు పాటను స్టేజ్ మీద డ్యాన్స్ వేయిస్తుంటే, తట్టుకోలేక ఆ ప్రదర్శన ఆపించి, ప్రిన్సిపాల్‌ను కడిగివేసే సీన్ ఆలోచింపజేయడమే కాకుండా ఆకట్టుకుంటాయి. ఇంగ్లీష్ మీద విపరీతమైన మమకారం పెంచుకొని మాతృభాషను మనమే ఎలా చిన్నచూపు చూస్తున్నామో ఆ సీన్లు కళ్లకు కట్టిస్తాయి. భార్య చనిపోయి ఒంటరివాడై పోయిన చక్రపాణి విషయం తన కుటుంబ గొడవల మధ్య మరిచిపోయిన రాఘవరావు, ఒకసారి అతడు గుర్తుకురాగా, పలకరించడానికి వెళ్లినప్పుడు అతడిని చక్రపాణి చెంపదెబ్బ కొట్టి మాట్లాడే సీను, క్లైమాక్స్‌లో రాఘవరావు తాను స్టేజ్ మీద చేసిన పాత్రల్ని గుర్తుకు తెచ్చుకొనే సీన్ నేరుగా మన హృదయాల్ని తాకుతాయి. ఇలాంటి సీన్లు సినిమా అంతా మనకు దర్శనమిస్తూ, ఇవాళ మనమేం చేస్తున్నామో, హక్కుల్ని మాత్రమే అడుగుతూ, బాధ్యతల్ని ఎలా విస్మరిస్తున్నామో నగ్నంగా నిలబెట్టి చూపిస్తాయి. భార్య సుబ్బు (జయలలిత) చనిపోయాక, ఆమెను తలచుకుంటూ రాఘవరావుతో చక్రపాణి చెప్పే డైలాగ్స్ సీన్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతుంది. స్నేహబంధం ఎంత గొప్పగా ఉంటుందో రాఘవరావు, చక్రపాణి పాత్రలు మనకు చూపిస్తాయి. ఇలా ఈ సినిమాలోని పాజిటివ్, నెగటివ్ క్యారెక్టర్లతో మనలోని ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఆ పాత్రలే మనంగా, అది మన జీవితంగా 'రంగమార్తాండ' ఆవిష్కృతమవుతుంది.

పాత్రధారుల నటన, కృష్ణవంశీ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన బలాలు అయితే, వాటి తర్వాత కచ్చితంగా ప్రస్తావించదగ్గది ఆకెళ్ల శివప్రసాద్ రాసిన సంభాషణలు. అనేక సన్నివేశాల్లో ఆకెళ్ల కలం బలం కనిపిస్తుంది. రంగస్థలం గురించీ, తెలుగు, ఇంగ్లిష్ నాటకాల గురించీ అవగాహన ఉన్నందునే ఆకెళ్ల అంత చక్కగా, అంత ప్రభావవంతంగా సంభాషణలు రాయగలిగారు. ఇళయరాజా సంగీతం పాటల్లో ఎంత బాగా ఆకట్టుకుందో, సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం అంత బాగా కుదిరి సన్నివేశాలకు తగ్గ గాఢతను అందించింది. రాజ్ కె. నల్లి ఛాయాగ్రహణం కూడా సినిమాకు ఓ ఎస్సెట్. పవన్ విన్నకోట ఎడిటింగ్‌కు వంకలు పెట్టలేం. 

నటీనటుల పనితీరు
'రంగమార్తాండ' అనేది ప్రధాన పాత్రధారులకు నటించడానికి అవకాశం ఇచ్చిన ఒక ఉత్తమ చిత్రం. టైటిల్ రోల్‌లో ప్రకాశ్‌రాజ్, ఆయన స్నేహితుడు చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం చెలరేగిపోయి నటించడాన్ని ఎంతగా ఆస్వాదిస్తామో! ఇప్పటికే ఉత్తమనటునిగా జాతీయ అవార్డును అందుకున్న చరిత్ర ఉన్న ప్రకాశ్‌రాజ్ నటనా సామర్థ్యాన్ని మరోసారి ఆవిష్కరించిన సినిమా ఇది. నాటకాల్లోని డైలాగ్స్‌ను ఆయన చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందంకు చక్రపాణి పాత్ర పోషణ అనేది అందివచ్చిన ఒక గొప్ప అవకాశం. అపూర్వమనే రీతిలో లైఫ్‌టైం పర్ఫార్మెన్స్ ఇచ్చారాయన. ఈ సినిమా చూసినవాళ్లు బ్రహ్మానందం నటన గురించి సుదీర్ఘ కాలం చెప్పుకుంటారు. రాఘవరావు భార్య 'రాజుగారు'గా రమ్యకృష్ణను కాకుండా మరొకర్ని ఊహించుకోలేం. ఎంత బాగా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయారు! భర్తకు నీడలా ఉంటూ, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చిన ఆమె జీవితం చరమదశలో భర్తకు ఎదురవుతున్న అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోయే పాత్రను ఆమె పోషించిన విధానానికి హ్యాట్సాఫ్. ఈ మూవీలోని ఇంకొక ఆశ్చర్యపరిచే నటన శివాత్మికది. శ్రీదేవి పాత్రలో ఆమె రాణించిన తీరు సూపర్బ్. అభినయానికి అవకాశమున్న పాత్రల్ని ఆమెకు ఎలాంటి సంకోచాలు లేకుండా ఇచ్చేయవచ్చు. గీత పాత్రలోకి అనసూయ అతి సునాయాసంగా ఇమిడిపోయింది. రంగారావుగా ఆదర్శ్, రాహుల్‌గా రాహుల్ సిప్లిగంజ్, సిద్ధార్థగా అలీ రెజా తమ పాత్రలకు న్యాయం చేశారు.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్
మరాఠీ సినిమా 'నటసమ్రాట్‌'కు రీమేక్ కావచ్చు కానీ తెలుగుతనం మూర్తీభవించే నేపథ్యంతో, ఓవర్ డ్రమటైజేషన్ అనిపించకుండా 'రంగమార్తాండ'ను ఒక క్లాసిక్‌గా మన ముందుకు తెచ్చారు దర్శకుడు కృష్ణవంశీ. కుటుంబసభ్యులంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. 'రంగమార్తాండ'.. మనల్ని మనం తెరపై చూసుకొనే సినిమా. మన తప్పుల్ని ఎత్తిచూపే సినిమా. మన బాధ్యతల్ని గుర్తుచేసే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే మనమందరం తప్పకుండా చూడాల్సిన ఒక గొప్ప సినిమా.

రేటింగ్: 4/5

- బుద్ధి యజ్ఞమూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.