ENGLISH | TELUGU  

'దాస్ కా ధమ్కీ' మూవీ రివ్యూ

on Mar 22, 2023

సినిమా పేరు: దాస్ కా ధమ్కీ
తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి, అజయ్, హైపర్ ఆది, మహేష్, పృథ్వీరాజ్, మురళీధర్ తదితరులు
కథ: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాత: కరాటే రాజు
దర్శకుడు: విశ్వక్ సేన్
బ్యానర్: వన్మయి క్రియేషన్స్
విడుదల తేదీ: 22 మార్చి 2023

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటుతున్నాడు. తాను హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'ఫ‌ల‌క్‌నుమాదాస్‌' చిత్రం 2019 లో విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు 'దాస్ కా ధమ్కీ' కోసం రెండోసారి మెగాఫోన్ పట్టాడు విశ్వక్ సేన్. పైగా ఇందులో ఆయన ద్విపాత్రాభినయం పోషించడం విశేషం. ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'దాస్ కా ధమ్కీ' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?.. హీరోగా, దర్శకుడిగా విశ్వక్ సేన్ కి మరో విజయాన్ని అందించేలా ఉందా?...

కథ:
కృష్ణ దాస్(విశ్వక్ సేన్) ఒక స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. అనాథ అయిన దాస్ తన స్నేహితులు(హైపర్ ఆది, మహేష్)లనే తల్లిదండ్రుల్లా భావిస్తాడు. వెయిటర్ గా అందరూ చిన్నచూపు  చూస్తుండటంతో, ఆ అవమానాలు భరించలేక.. డబ్బుల్లేకపోయినా రెస్పెక్ట్ కోసం ఒకసారి అదే హోటల్ కి  కస్టమర్ లా వెళ్తాడు. ఆ సమయంలో దాస్ కి కీర్తి(నివేదా పేతురాజ్) పరిచయమవుతుంది. దాస్ ని చూసి.. క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడాలనే గొప్ప ఆశయం కలిగిన ప్రముఖ ఫార్మా కంపెనీ సీఈఓ డాక్టర్ సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) అని కీర్తి భ్రమ పడుతుంది. దాస్ కూడా ఆమె ముందు ధనవంతుడిలా నటిస్తాడు. మరోవైపు తన ఆశయం నెరవేరకుండానే సంజయ్ రుద్ర అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. దీంతో రుద్ర బాబాయ్(రావు రమేష్) దాస్ ని కలిసి.. రుద్ర, నువ్వు ఒకే పోలికలతో ఉన్నారని, అతని ఆశయాన్ని బ్రతికించడం కోసం నువ్వు కొద్దిరోజులు రుద్ర స్థానంలోకి రావాలని కోరతాడు. డబ్బుకి ఆశపడిన దాస్.. రుద్రలా నటించడానికి ఒప్పుకుంటాడు. అయితే రుద్రకి, వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)కి మధ్య కుదిరిన పదివేల కోట్ల డ్రగ్ డీల్ ఏంటి? రుద్ర స్థానంలోకి దాస్ వెళ్ళాక అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? రుద్ర ఆశయాన్ని దాస్ నెరవేర్చాడా? డబ్బున్నవాడిలా నటించిన దాస్ మోసాన్ని కీర్తి గుర్తించిందా? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
డబ్బున్న వ్యక్తి చనిపోతే అతని స్థానంలోకి అవే పోలికలున్న వ్యక్తి వెళ్లడం అనే పాయింట్ తో రచయిత ప్రసన్న కుమార్ రాసిన కథలో కొత్తదనం లేదు. ఇప్పటికే ఈ తరహా కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. పైగా ప్రసన్న కుమార్ కథ అందించిన గత చిత్రం 'ధమాకా' ఛాయలు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు కథ రొటీన్ గా ఉన్నా.. కథనం, సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటే సినిమాలు హిట్ అవుతాయి. ఆ నమ్మకంతోనే ఈ సినిమాని తీసినట్టు ఉన్నారు.

ప్రథమార్థంలో వెయిటర్ దాస్ గా విశ్వక్ సేన్ పరిచయమవుతాడు. ఆది, మహేష్, నివేదా పాత్రలతో కలిసి అతను బాగానే వినోదాన్ని పంచాడు. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోయినా, అక్కడక్కడా లాజిక్ లెస్ అనిపించినా.. బోర్ కొట్టించకుండా సరదా సన్నివేశాలు, సంభాషణలతో ఫస్టాఫ్ ఉన్నంతలో బాగానే నడిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అలరించింది. ఇక ఈ సినిమాలో సెకండాఫ్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చెప్పాడు. ఫస్టాఫ్ ఎంతలా వినోదాన్ని పంచుతుందో, సెకండాఫ్ అంతకుమించి ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకొచ్చాడు. కానీ విశ్వక్ సేన్ చెప్పిన స్థాయిలో సెకండాఫ్ ఏమాత్రం లేదు. సెకండాఫ్ మొత్తాన్ని కొన్ని ట్విస్ట్ ల చుట్టూ అల్లుకున్నారు. ఒకట్రెండు ట్విస్ట్ లు తప్ప సెకండాఫ్ లో పెద్దగా అలరించే అంశాలు లేవు. కథనంలో కాస్త తడబాటు, గందరగోళం కనిపించాయి. సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా లేవు. క్లైమాక్స్ ని బాగానే డిజైన్ చేశారు. చివరిలో ఈ సినిమాకి సీక్వెల్ ఉందని చెప్పడం విశేషం.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథ అందించగా.. విశ్వక్ సేన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు, సెకండాఫ్ లో ఒకట్రెండు ట్విస్ట్ లు తప్ప సినిమాలో ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేవు. దర్శకుడిగా విశ్వక్ సేన్ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన పాటల్లో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మావ బ్రో పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం పరవాలేదు. దినేష్ బాబు కెమెరా పనితనం బాగుంది. సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఎడిటర్ అన్వర్ అలీ సెకండాఫ్ లో ఇంకాస్త కత్తెరకు పని చెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
వెయిటర్ కృష్ణ దాస్, డాక్టర్ సంజయ్ రుద్ర పాత్రల్లో విశ్వక్ సేన్ మెప్పించాడు. తన నటనతో ఆ పాత్రల్లోని వైవిధ్యాన్ని చక్కగా ప్రదర్శించాడు. ముఖ్యంగా ప్రథమార్థంలో ప్రేయసి దగ్గర డబ్బున్న వాడిలా నటించే వెయిటర్ దాస్ పాత్రలో అతని నటన ఆకట్టుకుంది. ఇక కీర్తి పాత్రలో నివేదా పేతురాజ్ చక్కగా రాణించింది. సెకండాఫ్ లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఫస్టాఫ్ లో ఉన్నంతసేపు బాగానే అలరించింది. రుద్ర బాబాయ్ పాత్రను రావురమేష్ సునాయాసంగా చేసేశారు. దాస్ స్నేహితుల పాత్రల్లో వెయిటర్స్ గా హైపర్ ఆది, మహేష్ బాగానే నవ్వించారు. అజయ్, రోహిణి, మురళీధర్, పృథ్వీరాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథాకథనాల కంటే ట్విస్ట్ లను ఎక్కువగా నమ్ముకొని రూపొందించిన చిత్రం దాస్ కా ధమ్కీ. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ఫస్టాఫ్ లో కాస్త హాస్యం, సెకండాఫ్ లో ఒకట్రెండు ట్విస్ట్ లు, విశ్వక్ సేన్ మార్క్ కొన్ని సన్నివేశాల కోసం ఒక్కసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.