భజనకి అలవాటుపడిపోయి.. మునిగిపోతున్న మెగాస్టార్!
on Aug 11, 2023

అసలే రామ్ గోపాల్ వర్మ.. ఆపై హర్ట్ అయ్యాడు. అందుకేనేమో తనదైన శైలిలో ట్వీట్స్ తో రెచ్చిపోయాడు. మామూలుగానే ఆర్జీవీ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంటాడు. అలాంటిది ఇటీవల జరిగిన 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ హైపర్ ఆది.. ఓ వైపు చిరంజీవిని ఆకాశానికెత్తుతూ, మరోవైపు ఆర్జీవీ మీద సెటైర్లు వేశాడు. చిన్న పెగ్ వేసి చిరంజీవి గురించి, పెద్ద పెగ్ వేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడని ఆర్జీవీపై పంచ్ లు పేల్చాడు. తాజాగా దీనికి ఆర్జీవీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి భజనకి అలవాటుపడిపోయి, మెగాస్టార్ మునిగిపోతున్నారని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశాడు.

చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' నేడు(ఆగస్టు 11) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అభిమానులు సైతం ఈ సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇదే సరైన సమయమని భావించాడో ఏమో గానీ.. సూచనతో కూడిన సెటైర్ లాంటి ట్వీట్స్ చేశాడు ఆర్జీవీ. "జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే" అని ఆర్జీవీ ట్వీట్స్ చేశాడు.ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



