'భీమ్లా నాయక్' కాదు 'డేనియల్ శేఖర్'.. రానానే హీరో!
on Feb 22, 2022

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' ట్రైలర్ తాజాగా విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. రికార్డు వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ ట్రైలర్ పట్ల పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ కట్ సరిగా లేదని, ట్రైలర్ లో రానానే హైలైట్ అవుతున్నాడని, పవన్ లుక్ కూడా బాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. పవన్ ఫ్యాన్ అయిన తనని ఈ ట్రైలర్ బాగా నిరాశపరిచింది అంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

'భీమ్లా నాయక్' ట్రైలర్ పై వరుస ట్వీట్స్ తో రెచ్చిపోయాడు ఆర్జీవీ. ట్రైలర్ చూసిన తర్వాత దీనికి 'భీమ్లా నాయక్' కాకుండా 'డేనియల్ శేఖర్(సినిమాలో రానా పాత్ర పేరు)' టైటిల్ పెడితే బాగుండేది అనిపించింది అంటూ సెటైర్ వేశాడు. అంతేకాదు, ఏవో కొన్ని కారణాల వల్ల రానాని ప్రమోట్ చేయడం కోసం మేకర్స్ పవన్ ని వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక పవన్ ఫ్యాన్ గా ఈ ట్రైలర్ చూసి బాధపడ్డానని ఆర్జీవీ తెలిపాడు.

నిజాయితీగా చెప్పాలంటే 'భీమ్లా నాయక్' ట్రైలర్ చూసినప్పుడు పవన్ ట్రైలర్ అయితే, రానా ఫిల్మ్ అనిపించాడు అని ఆర్జీవీ అన్నాడు. "బాహుబలి కారణంగా నార్త్ లో పవన్ కంటే రానా ఎక్కువ పాపులర్. వాళ్ళు ఈ ట్రైలర్ చూస్తే రానా హీరో అని, పవన్ విలన్ అని అనుకునే ప్రమాదముంది. పవన్ సన్నిహితులైన నిర్మాతలు ఇలా చేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



