మెగాస్టార్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్న పూరి!
on Nov 21, 2022

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఆటో జానీ' చిత్రంతో రీఎంట్రీ ఇవ్వాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఏవో కారణాల వల్ల ఆ సినిమాతో కాకుండా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి చిరంజీవి-పూరి కాంబినేషన్ లో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల చిరంజీవి స్వయంగా పూరికి కథ సిద్ధం చేయమని చెప్పడంతో చర్చలు ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ కోసం పూరి అదిరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
విజయ్ దేవరకొండతో పూరి చేసిన 'లైగర్' ఘోర పరాజయం పాలవ్వడంతో.. వారి కాంబినేషన్ లో రావాల్సిన మరో మూవీ 'జన గణ మన' అటకెక్కింది. దీంతో పూరి తదుపరి చిత్రం ఏంటనే చర్చలు జరుగుతున్న సమయంలో మెగాస్టార్ పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి రీసెంట్ మూవీ 'గాడ్ ఫాదర్'లో పూరి కీలక పాత్రలో నటించాడు. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరుతో పూరి చిట్ చాట్ నిర్వహించగా.. 'ఆటో జానీ' స్క్రిప్ట్ ఏం చేశావని చిరు అడిగాడు. ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశానని, మీ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసి కలుస్తానని పూరి చెప్పగా.. త్వరగా కథ సిద్ధం చేసి కలవాలని చిరు అన్నాడు.
చిరు చెప్పినట్టుగానే ప్రస్తుతం ఆయన కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పూరి ఉన్నాడట. ఇది తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర తండ్రిదని, ఆ పాత్ర పూరి శైలిలో కొత్తగా ఉంటుందని అంటున్నారు. పూరి, హీరోలను ప్రజెంట్ చేసే విధానం బాగుంటుంది. అందుకే మెగా ఫ్యాన్స్ సైతం పూరి-చిరు కాంబో పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' చిత్రాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే 'భోళా శంకర్' తర్వాత చిరు చేసే సినిమా పూరితోనే అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



