`ప్రాజెక్ట్ కే`లో మాలీవుడ్ స్టార్?
on Jul 28, 2021
పృథ్వీరాజ్ సుకుమారన్.. మాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తూ నటుడిగా స్టార్ డమ్ చూసిన పృథ్వీరాజ్.. కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకత్వం, నిర్మాణం, గానం, పంపిణీ రంగాల్లోనూ తనదైన ముద్రవేశారు. అలాగే మలయాళంతో పాటు తమిళ, హిందీ, తెలుగు భాషల్లోనూ నటుడిగా అలరించారు.
ఇదిలా ఉంటే.. `పోలీస్ పోలీస్` (2010) తరువాత మళ్ళీ తెలుగులో నటించని ఈ మల్టిటాలెంటెడ్ త్వరలో ఓ పాన్ - వరల్డ్ మూవీతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించనున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ `ప్రాజెక్ట్ కే` (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళిన ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ దివా దీపికా పడుకోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పృథ్వీరాజ్ ని సంప్రదించారట నాగ్ అశ్విన్. పాత్ర నచ్చడంతో ఈ పాన్ - వరల్డ్ మూవీలో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట పృథ్వీరాజ్. త్వరలోనే `ప్రాజెక్ట్ కే`లో పృథ్వీరాజ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
Also Read