చిరంజీవికి విషమున్న కేక్ తినిపించిన అభిమాని!
on Jan 12, 2023

చిరంజీవి కాస్తా మెగాస్టార్ చిరంజీవిగా ఎదుగుతున్న సమయంలో ఆయనంటే గిట్టని వాళ్లు అప్పట్లో ఒక పని చేశారు. చంటబ్బాయి, కొండవీటి రాజా, విజేత ఇలా వరుస హిట్లను అందుకుంటున్న చిరును చూసి కొందరు ఓర్చుకోలేక పోయారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవిపై అప్పట్లో విష ప్రయోగం కూడా జరిగింది. దానిని అప్పటి స్టార్ హీరోస్ చేయించారని పలు రకాల పుకార్లు షికారు చేశాయి. కానీ అవన్నీ కేవలం పనీపాటా లేని వారి ప్రచారం మాత్రమే. నిజానికి చిరంజీవి బయట ఫుడ్ తినాలంటే భయపడేవారు.
షూటింగ్ సమయంలో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్లీ షూటింగ్కు అంతరాయం కలుగుతుందని భావించేవారు. అయితే చిరంజీవి హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో కె.యస్. రామారావు నిర్మాతగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మరణ మృదంగం అనే షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ గ్యాప్ లో చాలామంది ఫ్యాన్స్ గేటు వద్ద ఉండటంతో చిరు వారిని వెళ్లి కలిశారు. అప్పుడే ఓ అభిమాని చిరంజీవి కాళ్ళపై పడ్డాడు. ఈరోజు నా బర్త్ డే అని చెప్పి చిరు చేత కేక్ కట్ చేయించాడు. అంతే కాకుండా కేకును తినాలని చిరుని కోరాడు. కానీ ఆయన షూటింగ్‌లో ఉన్నాను తినలేను అని చెప్పారు. దాంతో అభిమాని కేక్ తీసుకుని చిరంజీవి నోట్లో కుక్కాడు.
తోపులాటలో కేక్ కింద పడిపోయింది. ఆ కేక్ లో మెగాస్టార్ రంగు రంగుల పదార్థాలను గుర్తించారు. వెంటనే కేకును ఉమ్మేసి నోరు కడుక్కున్నారు. షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కానీ చిరంజీవి నాలుక నీలి రంగులోకి మారిపోయింది. అది గమనించిన మేకప్ మెన్ వెంటనే విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పారు. దాంతో చిరంజీవిని ఆసుపత్రికి తరలించగా విషం ప్రయోగం జరిగిందన్నారు. వాంతి అయ్యేలా చికిత్స చేశారు. మరుసటి రోజు ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పారు. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది.
తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో ఈ విష ప్రయోగంపై స్పందించారు. విష ప్రయోగం జరిగిన మాట వాస్తవమేనని ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ పిచ్చి ఫ్యాన్ చేసిన పని అది. ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు నన్ను చూడటానికి చాలా మంది వచ్చారు. కొందరు అభిమానులు వచ్చి నన్ను కట్ చేయమని కోరారు. నేను అలాగే కేక్ కట్ చేశాను. ఒక వ్యక్తి కేక్ ముక్క కట్ చేసి బలవంతంగా తన చేత్తో నోట్లో పెట్టేసాడు. అయితే ఆ కేక్ కాస్త చేదుగా అనిపించింది చూస్తే కేక్ లో ఏదో పౌడర్ మిక్స్ అయినట్టు అనిపించింది. మా వాళ్లు వాడిని పట్టుకొని అడిగితే ఏం లేదన్నాడు. కానీ ఆ కేకును టెస్టులకు పంపిస్తే పాయిజన్ అని రిపోర్టు వచ్చింది. ఆ వెంటనే నిర్మాత కె.యస్. రామారావు గారు అతని కొట్టారు.
ఎందుకు ఇలా చేశావు అని అడిగితే ఆ అభిమాని ఈమధ్య చిరంజీవి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఆయనకు దగ్గర అవ్వాలని ఇలా చేశాను. కేరళ నుంచి వశీకరణ మందు తెచ్చి కేక్ లో కలిపాను అన్నాడు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. విషప్రయోగం అనే పెద్ద పదాలు వాడొద్దని చెప్పాను. పాపం వాడిది అభిమానం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో నాకే అర్థం కాలేదు. అతడు మాత్రం అభిమానంతోనే చేశాడు. అలాంటి వాడిని ఏం చేస్తామని నవ్వి ఊరుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



