ENGLISH | TELUGU  

పదేళ్లకే రేడియో ఉద్యోగం - ఆర్కాడు పార్ధసారథి కోమల

on Aug 29, 2020


పదేళ్లకే  రేడియో ఉద్యోగం
అరశతాబ్దంపైగా సంగీతసేవ
ఆమె స్వరం మధురాతి మధురం
ఆర్కాడు పార్ధసారథి కోమల
(28 ఆగస్టు 1934)
తమ సుమధురమైన, కోమలమైన స్వరంలో శ్రోతలను ఆకట్టుకున్న అరుదైన గాయని ఆమే. రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం భాషల్లో దాదాపు ఐదువేల పాటలు పాడిన దక్షిణ భారతదేశపు నేపథ్యగాయని. ఆమే ఆర్కాడు పార్థసారథి కోమల. మూడేండ్ల వయసు నుంచి సంగీత సాధన చేసిన ఆమె పదేండ్లకే ఆల్ ఇండియా రేడియాలో ఉద్యోగం సాధించారు. దాదాపు అర దశాబ్దం రేడియో కళాకారిణిగాా వేలాది కచేరిలు చేశారు. ఎన్నో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.  ఎన్‌టిఆర్‌ స్థాపించిన ఎన్‌ఎటీ బ్యానర్‌లో ప్రతి చిత్రానికి ఆరంభ గీతం ఆలపించిన మధురస్వరం ఆమెది.  కోకిలలాంటి ‘కోమల’మైన స్వరంతో శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించిన గళం ఆమెది. ఈ రోజు ఆమె జన్మదినం..

తమిళనాడులోని తిరువళ్లికేనులో కోమల జన్మించారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, పార్థసారధి. సంగీతాన్ని ఆరాధించే కుటుంబం కావడంతో మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలను తల్లిదండ్రులు ప్రొత్సహించారు.ఆమె గళంలోని మాధుర్యాన్ని గుర్తించి సంగీతంలో శిక్షణ ఇప్పించారు.  ఏడేళ్ల వయసులో రాజమండ్రిలోని గురుకులంలో నాదస్వర విద్వాన్‌ గాడవల్లి పైడిస్వామి వద్ద ఆమె శాస్త్రీయ సంగీతం,  ప్రముఖ వీణా విద్వాంసులు ఎస్‌.నరసింహులు దగ్గర వీణ నేర్చుకున్నారు.

రేడియో ఆర్టిస్టుగా

ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నారు. ఆ కార్యక్రమానికి హజరైన దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆమె గానానికి పరవశిస్తూ.. కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారట. 1944లో ఆమె గామాధుర్యాన్ని గుర్తించి రేడియో ఆర్టిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అప్పడు కోమల వయసు పదేళ్లు. అలా పదేళ్లకే ఉద్యోగంలో చేరిన ఆమె జీతం నెలకు 50రూపాయలు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో వార్ అలవెన్సు గా మరో 14 రూపాయలు ఇచ్చేవారట.

తెలుగులో తొలిపాట..

కోమలి మాతృభాష తమిళం. అయినా ఆమె సంగీత సాధనంతా తెలుగునేలపైనే. అంతేకాదు ఆ పాడిన మొదటి సినిమా పాట కూడా తెలుగుభాషలోనే. 1946లో చిత్తూరు నాగయ్య తీసిన త్యాగయ్య సినిమాలో 'మధురానగరిలో చల్లనమ్మ' అనే పాట పాడారు. ఆ పాటకు ఆమె తీసుకున్న పారితోషకం 250రూపాయలు. ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ గ్రామ్ ఫోన్ కంపెనీలో ప్రైవేటు యుగళగీతాలు ఎన్నో ఆమె ఆలపించారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళం భాషల్లో కోమల దాదాపు ఐదువేల పాటలు పాడారు. సుశీల, జానకీ, ఎల్.ఆర్. ఈశ్వరీ ఇలా అందరితో కలిసి ఆమె పాడారు. అనేక మంది ప్రముఖ సంగీత దర్శకుల దర్శకత్వంలోనూ ఆమె గీతాలు ఆలపించారు. ఆమె చేసిన సంగీత కచేరీలు లెక్కకు మించే ఉన్నాయి.
శాస్త్రీయ సంగీతంలో ఆమె ప్రతిభకు గాను తమిళనాడులోని ఒక సంగీత సంస్థ ‘మధురవాణి’ బిరుదుతో సత్కరించింది. 2001లో తిరుపతిలోని ఘంటసాల గాన కళాపీఠం ‘అమృతగాన వర్షిణి’గా  కోమలను కీర్తించింది. తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ అవార్డును 2003లో కోమల అందుకున్నారు.
ప్రస్తుతం కళాకారిణిగా ఫించన్ తీసుకుంటూ తమిళనాడులో ఉంటున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.