'ఆర్ఆర్ఆర్' విడుదలపై స్టే కోసం హైకోర్టుని ఆశ్రయించిన అల్లూరి సౌమ్య!
on Jan 5, 2022

కరోనా మళ్ళీ విజృంభిస్తుండటంతో జనవరి 7 న విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటికే ప్రమోషన్స్ కి భారీగా ఖర్చు పెట్టడంతో మేకర్స్ కి కోట్లల్లో నష్టం వచ్చింది అంటున్నారు. ఇదిలాఉంటే ఓ వైపు వాయిదాతో ఇబ్బంది పడుతున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ తాజాగా ఒకరు హైకోర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ చరిత్రను వక్రీకరించారంటూ పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ దాఖలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన పిల్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. అయితే ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జన్ భూయాన్ బెంచ్ తెలిపింది.
కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కించలేదని.. ఇది పూర్తి కల్పిత కథ అనీ ఇప్పటికే ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. అయినప్పటికీ ఈ సినిమాని వివాదాలు వెంటాడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పేర్లు పెట్టుకొని మీకు నచ్చినట్లు కథ రాసుకొని సినిమా తీస్తారా అంటూ కొందరు తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఏకంగా సినిమాపై స్టే ఇవ్వాలని కోరుతూ ఒకరు కోర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



