'యమలీల' చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా!
on Oct 27, 2022

'యమలీల', 'శుభలగ్నం', 'మాయలోడు', 'ఘటోత్కచుడు' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని జంటగా నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేసి టీజర్ ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. "కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత కృష్ణారెడ్డిగారు కమ్‌బ్యాక్ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు" అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ... " ప్రస్తుతం ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్‌కు రావడం మానేసి ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఫ్యామిలీస్‌ను థియేటర్స్‌కు రప్పించే కంటెంట్ సినిమాల్లో తగ్గి పోవడమే. అటువంటి కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్ కృష్ణారెడ్డిగారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో మళ్లీ థియేటర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కళకళలాడతాయి అని నాకు గట్టి నమ్మకం. ఇక రాజేంద్రప్రసాద్ నా హీరో, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. మీనాగారు అయితే ఆమె భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని భావించి, ఆయన చనిపోయిన దాదాపు 15 రోజుల తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు. మరొక ఆర్టిస్ట్ అయితే ఇలా ఖచ్చితంగా సహకరించి ఉండేవారు కాదు. ఈ సినిమా విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ లేదు. అంతా మా ఆవిడ కల్పనే చూసుకుంది. ఆమెకు, కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... "నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్‌లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. ఈ స్క్రిప్ట్‌ను కల్పన గారికి వినిపించగానే.. ఇంత మంచి స్క్రిప్ట్ మనం స్క్రీన్ మీద పెట్టక పోతే ఎలా.. మనం ఈ సినిమా చేసేస్తున్నాం అంతే అని ఆ క్షణంలోనే ఫిక్స్ అయిపోయారు. ఆరోజు నుంచి 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆమె ఎలా ప్లాన్ చేశారో నాకు అయితే తెలియదు. ప్రతి రోజూ లొకేషన్‌లో నాకు కావాల్సినవి, కావాల్సిన టైంకు సమకూరాయి అంతే. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇక మీనా గారి గురించి ఏం చెప్పాలి ఆమె సూపర్ నటి. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది. సోహెల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది" అన్నారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ... "నేను చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది." అన్నారు.
నటుడు ఆలీ మాట్లాడుతూ... "ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. పైగా మామ, అల్లుడు కాంబినేషన్ అనేది హిట్ ఫార్ములా. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయినట్టే భావించాలి. నిర్మాత కల్పనగారు యూనిట్‌ను తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. సోహెల్ తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. కృష్ణారెడ్డి గారి హ్యాండ్ పడింది అంటే ఇక సోహెల్ స్టార్ అయినట్టే. మా గురువుగారు కృష్ణారెడ్డి గారికి మళ్లీ ఈ సినిమా పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నా" అన్నారు.
సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సి. రాంప్రసాద్, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



