సాయి పల్లవి సినిమాని పట్టించుకునే వారే లేరే
on Jul 13, 2022

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ లేడీ పవర్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. 'ఫిదా'(2017)తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక గతేడాది 'లవ్ స్టోరి', 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలతో ఆకట్టుకొని తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. కానీ ఈ ఏడాది ఏంటో సాయి పల్లవికి అసలు కలిసి రావడం లేదు. ఆమె సినిమా విడుదలవుతుంటే కనీసం పట్టించుకునే వారే లేరు.

ఈ ఏడాది 'విరాట పర్వం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సాయి పల్లవి. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవడంతో ఓ మోస్తారు కలెక్షన్స్ కూడా రాబట్టలేక కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు జులై 15న 'గార్గి' అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతోంది సాయి పల్లవి. ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాపై అసలు బజ్ ఏర్పడలేదు. 'విరాట పర్వం'లో రానా కూడా నటించాడు. పైగా ప్రమోషన్స్ భారీస్థాయిలో చేశారు. అయినా ప్రేక్షకులు థియేటర్స్ లో ఆ సినిమా చూడటానికి ఆసక్తి చూపించలేదు. అలాంటిది ఇప్పుడు అంతగా ప్రచారం లేని, పెద్దగా ఎవరికీ తెలియని డబ్బింగ్ సినిమా 'గార్గి'పై ఇంట్రెస్ట్ చూపిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.

సాయి పల్లవి సినిమాలకు ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆమె సినిమాల ఎంపిక కాగా, రెండు ఇటీవల 'కాశ్మీర్ ఫైల్స్' గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు. సాయి పల్లవి అంటే ముందుగా గుర్తొచ్చేవి.. ఆమె కట్టు, చలాకీతనం, డ్యాన్స్, డైలాగ్స్. 'ఫిదా' సినిమాలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కి, డ్యాన్స్ స్టెప్పులకి, డైలాగ్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఆ సినిమా మెజారిటీ క్రెడిట్ సాయి పల్లవి ఖాతాలోకి వెళ్ళింది. కానీ ప్రస్తుతం సాయి పల్లవి సినిమాల్లో ఆమె అభిమానులు ఆశించే అంశాలు మిస్ అవుతున్నాయి. 'విరాట పర్వం' పేరుకి ప్రేమ కథ అయినప్పటికీ.. అది నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా. అందుకే యూత్ ఆ సినిమా చూడటానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఇక ఇప్పుడు 'గార్గి' కూడా ఒక కోర్టు డ్రామా. అన్యాయంగా జైలుపాలైన తన తండ్రిని బయటకు తీసుకురావడం కోసం ఒక కూతురు సాగించే న్యాయం పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. అందుకే ఆమెను ఎంతో అభిమానించే యూత్ కూడా ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఈ విషయాన్ని సాయి పల్లవి కూడా ఆలస్యంగా గుర్తించినట్లుంది. ఈసారి మంచి డాన్స్ నెంబర్స్ ఉండే ఎంటర్టైనర్ చేస్తానని ఇటీవల ప్రకటించింది. అలాంటి సినిమా చేస్తే మళ్ళీ సాయి పల్లవి సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి కదులుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే 'విరాట పర్వం' సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెని ఒక వర్గం ప్రేక్షకులకి దూరం చేశాయి. "ఏ మతంలోనైనా హింస తప్పు.. మతం కంటే మానవత్వం గొప్పది" అని చెప్పే క్రమంలో ఆ మేటర్ సరిగా కన్వే అవ్వక ఆమె విమర్శలు ఎదుర్కొంది. ఆ టైంలో ఆమె సినిమాలు ఇక చూడమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై మాట్లాడి విమర్శల పాలయ్యే కంటే, మౌనంగా ఉండటం ఉత్తమమని సాయి పల్లవి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



