హీరోని చేస్తామని డబ్బులు పుచ్చుకున్న వారి బండారం బయటపెట్టిన నిఖిల్!
on Dec 25, 2022

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా ప్రపంచం. వెండితెర పైన వెలగాలని ప్రయత్నాలు చేసే ఉత్సాహవంతులు ఎందరో ఉంటారు. ఈ మాయా ప్రపంచంలో వారిని బురిడీ కొట్టించి జేబులు నింపుకునే సినిమా కేటుగాళ్లకు కొదవేమీ లేదు. ఆడవాళ్ళనైతే హీరోయిన్లను చేస్తామని కాస్టింగ్ కౌచ్ పేరుతో వారిని అనుభవించాలని చూస్తారు. అదే మగవారిని అయితే హీరోలను చేస్తామని డబ్బులు డిమాండ్ చేసి జేబులు కొల్లగొడతారు. ఈ విషయాలను చాలామందికి బయటకు చెప్పుకోరు. కానీ వీరిలో నేడు హీరోలుగా వెలుగుతున్న పలువురు కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి అనుభవాలను ఫేస్ చేసినవారే.
ప్రస్తుతం హీరో నిఖిల్ కు మంచి పేరుంది. ఇటీవలే కార్తికేయ-2 తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే చేసిన 18 పేజెస్ చిత్రం కూడా ఫీల్‌గుడ్ మూవీగా తెలుగు నాట పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఇలా ఆయన వరుస హిట్స్ అందుకుంటున్నాడు. కానీ ఇతడు ఒకనాడు ఈటీవీ సీరియల్ లో చిన్న చిన్న వేషాలు, ఆ తరువాత సంబరం, హైదరాబాదు నవాబ్స్ వంటి చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేశాడు. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ తో వాస్తవానికి అతను అసలు సిసలైన తెరంగేట్రం ఇచ్చాడు. ఆ తర్వాత కూడా సోలో హీరోగా నటించాలని పలు ప్రయత్నాలు చేశాడు. అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే మూవీ కూడా అందులో ఒకటి. కానీ యువత నుంచి మాత్రం ఆయనకు కాస్త క్రేజ్ వచ్చింది. యువత తర్వాత కళావర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో వంటి చిత్రాల వరకు ఆయన కెరీర్ చప్పగానే సాగింది. కానీ ఒక స్వామి రారా, కార్తికేయల నుంచి ఆయన రేంజ్ మారిపోయింది.
తాజాగా నిఖిల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి తొలినాళ్లలో నేను చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో కొంతమంది ఆడిషన్స్ పేరిట మోసాలు చేశారు. కోటి రూపాయలు తెస్తే హీరో చేస్తామని వారు చెప్పారు. కొందరు 50 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఒకరు ఆడిషన్స్ చేసి నటుడిగా ఎంపిక చేసామని చెప్పి నా నుంచి ఐదు లక్షలు తీసుకున్నారు. చివరకు ఆ సినిమా చిత్రీకరణకు కేవలం లక్ష ఖర్చు పెట్టేసి ఉడాయించేశారు. కానీ ఆ తరువాత ఇదంతా ఫేక్ అని తెలిసింది. కానీ శేఖర్ కమ్ముల గారు చాలా నిజాయితీ మనిషి. నా యాక్టింగ్ నచ్చి ఒక అవకాశం ఇచ్చారు. అది నా కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇప్పుడు ఆలోచిస్తే నేను కొందరి చేతుల్లో ఎలా మోసపోయానో అనిపిస్తుంది.... అని చెప్పుకొచ్చాడు. ఇలాంటివి చూస్తే వర్మ మనీ చిత్రంలో చూపించిన బ్రహ్మానందం క్యారెక్టర్తో పాటు పూరీ తీసిన నేనింతే చిత్రాలు మనకి గుర్తుకు రాకమానవు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



