నయనతార-మాళవికమోహన్‌ల వాదనలలో వాస్తవమెంత?
on Dec 25, 2022

సినిమాలను చాలామంది రియలిస్టిక్ సినిమాలని, కమర్షియల్ సినిమాలని విభజిస్తూ ఉంటారు. కమర్షియల్ సినిమాలలో ఒక హీరో 100 మంది ఫైటర్స్‌తో కూడా పోరాటం చేస్తాడు. అయినా ఏమాత్రం ప్యాంటు, షర్టు నలగవు. ప్యాంటు-షర్టులను టక్ చేసినా వారి దుస్తులు మాత్రం అంతటి పోరాటం తర్వాత కూడా చెక్కుచెదరవు. జుట్టు మామూలుగా ఎలా ఉంటుందో అంతే స్టైలిష్ గా ఉంటుంది. ఒక్కొక్కరిని కొడుతుంటే విలన్లు గాల్లో ఎగిరి పడుతుంటారు. ఇక హీరోయిన్లతో వందల మంది డాన్సర్లతో కలిసి చిందులు వేస్తూ ఉంటారు. ఇలాంటివి కమర్షియల్ సినిమాలని అంటారు. ఇక ఏ మాత్రం పాటలు, అతిగా అనిపించే పోరాట దృశ్యాలు లేకుండా నేచురల్ గా తీసే చిత్రాలను రియలిస్టిక్ సినిమాలంటూ విభజిస్తారు.
కమర్షియల్ సినిమాలలో ప్రేక్షకులను దర్శకులు ఒక ఊహలోకంలోకి తీసుకొని వెళ్తారు. నిజ జీవితంలో తమకు అసాధ్యమైన వాటిని హీరోలు చేస్తున్నట్లుగా చూపించి...అబ్బా... మనం కూడా ఇలా వందమందిని కొడితే ఎలా ఉంటుంది? క్షణాలలో కోటీశ్వరులమైపోతే ఎలా ఉంటుంది? అందమైన హీరోయిన్లతో చిందులేస్తే చాలా బాగుంటుంది కదా! అంటూ మనం కూడా అలాగే ఉంటే ఎలా ఉంటుంది? అనే ఫీలింగ్ ని తీసుకుని వస్తారు. కానీ రియలిస్టిక్ సినిమాలు అలా ఉండవు. మనం కూడా నిజజీవితంలో ఇలాంటి ఘటనలు ఎదురైతే ఇలాగే ప్రవర్తిస్తాము కదా! ఇలాంటి సందర్భాలు ఎదురైతే మనం ఇలాగే చేస్తాము కదా! అనే వాస్తవికతను చూపిస్తారు. కానీ ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అలా తీసే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు బాలా సినిమాలు చూస్తే కొందరు వాటిని రియలిస్టిక్ అంటారు. కానీ వాటిలో కూడా పాటలు, పోరాటాలు ఉంటాయి. కానీ రియల్ అనిపించేలా ఉంటాయి. ఇలాంటి తెలుగు చిత్రాల విషయానికొస్తే రంగస్థలం, పుష్ఫ- ది రైజ్‌చిత్రాలను మనం అలాంటి చిత్రాలని చెప్పుకోవాలి. అవి పూర్తిగా కమర్షియల్ కాదు. అలాగని రియలిస్టిక్ కాదు. అందులో కూడా వందల మందిని చితక్కొట్టే ఫైట్స్ ఉంటాయి. హీరోయిన్లతో చిందులు వేసే సాంగ్స్ ఉంటాయి. కానీ మిగిలిన వాటిలో అంటే వస్త్రధారణ నుంచి బాడీ లాంగ్వేజ్, సన్నివేశాలలో సహజత్వం ఉట్టిపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇక విషయానికి వస్తే గతంలో మాళవిక మోహన్ నయనతార గురించి మాట్లాడుతూ ఓ లేడీ సూపర్ స్టార్... ఎంతో ఇమేజ్ కలిగిన హీరోయిన్ కూడా ఆసుపత్రిలో కనిపించే సన్నివేశాలలో మేకప్ వేసుకొని, లిప్‌స్టిక్ పూసుకుని అందంగా తయారవుతూ కనిపించిందని, వాటిని చూసి తాను ఆశ్చర్యపోయానని, ఒక విధంగా షాక్‌కి గురయ్యానని కామెంట్ చేసింది. దానికి ఇటీవల నయనతార సమాధానం ఇస్తూ ఆ హీరోయిన్ పేరు నేను ప్రస్తావించను. ఆమెకు కమర్షియల్ సినిమాలకు రియలిస్టిక్ సినిమాలకు తేడా తెలియదని అనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలలో దర్శకులు ఏమి చెబితే మనం అదే చేయాలి. కమర్షియల్ సినిమాలంటే అలాగే ఉంటాయి.. కాబట్టి ఆమె కమర్షియల్ సినిమాలకు, రియలిస్టిక్ సినిమాలకు మధ్య తేడాలను గుర్తిస్తే మంచిది... అని వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి మాళవిక మోహన్ -నయనతారాల వాదనలో ఎవరిది కరెక్ట్ అనే మీమాంస వస్తుంది. కొందరికి మాత్రం మాళవిక మోహన్ వ్యాఖ్యలు సరైనవి అనిపిస్తే.... మరికొందరికి నయనతార చెప్పింది కూడా నిజమే కదా అనిపిస్తుంది. మరి ఇద్దరి వాదనలో ఎవరిది కరెక్ట్ అనేది కాస్త వాస్తవిక దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



