‘నాగేంద్రన్స్ హానీమూన్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
on Jul 19, 2024

వెబ్ సిరీస్ : నాగేంద్రన్స్ హనీమూన్స్
నటీనటులు: సూరజ్ వెంజరమూడ్, కనీ కుస్రుతి, శ్వేత మీనన్, అమ్ము అభిరామి, అల్పి పంజికరన్, గ్రేస్ ఆంటోనీ, శివానీ సత్య, కలభవన్ షాజోన్, ప్రమోద్ వెల్లియానంద్ , అలెగ్జాండర్ ప్రశాంత్, జనార్థన్ తదితరులు
ఎడిటింగ్: మన్సూర్ ముతుట్టి
సినిమాటోగ్రఫీ : నిఖిల్ ఎస్. ప్రవీణ్
మ్యూజిక్: రంజిన్ రాజ్
నిర్మాతలు: నితిన్ రెంజీ పనీకర్
దర్శకత్వం: నితిన్ రెంజీ పనీకర్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ :
తిరువనంతపురంలోని ఓ గ్రామంలో నాగేంద్రన్ తన అమ్మతో కలిసి ఉంటాడు. ప్రతీరోజు ఉదయమే లేచి ఆ ఊళ్ళోని చిన్న హోటల్ కి వెళ్ళి అక్కడ టీ తాగేసి పడుకొని , మధ్యాహ్నం అక్కడే తినేసి, రాత్రి బయట తన ఫ్రెండ్ సోమతో కలిసి తాగేసి తిరిగి ఇంటికి వస్తుంటాడు. అతనికి చిన్నతనం నుండి చదువు అబ్బకపోవడంతో తన ఫ్రెండ్ సోమతో కలిసి పనేమీ లేకుండా ఉంటాడు. అయితే తనకి కువైట్ వెళ్ళాలని కల ఉంటుంది. దానికోసం తన అమ్మని డబ్బులు అడుగుదామని అనుకున్నా. వారికి పూట గడవడమే కష్టంగా ఉంటుంది. తన మేనమామ కూతురుకి నాగేంద్రన్ అంటే ఇష్టం ఉంటుంది. నాగేంద్రన్ కి తన ఫ్రెండ్ సోమ... నీ మరదలిని పెళ్ళి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులతో కువైట్ వెళ్ళి బాగా సంపాదించి సెటిల్ అవ్వొచ్చని ఓ ఐడియా ఇస్తాడు. దాంతో తన మేన మరదలిని పెళ్లి చేసుకుంటాడు నాగేంద్రన్. ఆ తర్వాత రోజే అతనికి తెలిసేది ఏంటంటే తను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకురాకుండా వచ్చిందని.. ఇక అదే విషయం తన ఫ్రెండ్ సోమకి చెప్పగా.. బాధపడకని ఓదార్చి కొన్ని రోజులకి మరో సంబంధం తీసుకొస్తాడు. మరి నాగేంద్రన్ తన ఫ్రెండ్ సలహా విన్నాడా? ఎందుకు నాగేంద్ర అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? విదేశాలకి వెళ్ళాలనుకున్నా నాగేంద్రన్ కల నెరవేరిందా లేదా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
నాగేంద్రన్ లైఫ్ ని చాలా సాదాసీదాగా మొదలెట్టాడు దర్శకుడు. ఈ కథ మొత్తం నాగేంద్రన్ చుట్టూనే సాగుతుంది. తన ఫ్రెండ్ సోమని నమ్ముతూ అతను ఒక్కో పెళ్ళి చేసుకోవడం అంతా బాగుంటుంది.
అయితే కథలో ఎంటర్‌టైన్మెంట్ కరువైంది. పెళ్ళి తర్వాత హీరో లైఫ్ ని డిజైన్ చేయడంలో కామెడీ రప్పించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో అమ్మాయి పేరు ఉంటుంది.
మొదటి ఎపిసోడ్ జానకీ: తన మేన మరదలిని పెళ్ళి చేసుకోవడానికి తను ఏం చేసాడనేది చూపించాడు. రెండవది : లిల్లికుట్టీ.. జోసెఫ్ అనే పేరుతో ఆమెని చేసుకుంటాడు. ఇక మూడవది లైలా: ఓ ముస్లీం అమ్మాయిని పేరు మార్చుకొని చేసుకుంటాడు. నాల్గవది సావిత్రి: మరో పేరుతో సావిత్రిని ఎలా పెళ్ళి చేసుకున్నాడనేది ఇందులో ఉంది. అయిదవది తంగం.. కేరళలోని మారుమూల గ్రామంలోని తంగం అనే అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడో ఇందులో ఉంటుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ మోజీ.. సోమ తనకి తెలిసిన అమ్మాయి అని చెప్పి నాగేంద్రన్ ని పెళ్ళికి ఒప్పించి జరిపిస్తాడు. ఆ తర్వాత తన లైఫ్ మలుపు తిరుగుతుంది. ఈ క్లైమాక్స్ కొంతమందిని మాత్రం మెప్పిస్తుంది.
అసలు ఈ సిరీస్ లో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ఓ మూడు ఎపిసోడ్ లలో చెప్పేయొచ్చు కానీ అనవసరంగా లెంత్ పెంచడానికి ఆరు ఎపిసోడ్ లు గా మలిచారనిపిస్తుంది. కథ సింపుల్ విదేశాలకి వెళ్ళాలనుకున్న నాగేంద్రన్ కి లైఫ్ లో అనుకోకుండా జరిగిన పెళ్ళిళ్ళు.. దీనికోసం చాలా సమయం తీసుకున్ననాడు దర్శకుడు. కొన్ని చోట్ల అశ్లీల దృశ్యాలు ఉన్నాయి. కథ బాగున్నప్పటికి ల్యాగ్ అండ్ లెంతీ సీన్లు చాలా ఉన్నాయి. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
నాగేంద్రన్ పాత్రలో సూరజ్ వెంజరమూడ్ ఆకట్టుకున్నాడు. ఇక శ్వేత మీనన్ణ కనీ కుస్రుతి, అమ్ము అభిరామి, అలెగ్జాండర్ ప్రశాంత్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: స్లోగా సాగే కథనం ఇబ్బందిగా ఉన్నప్పటికి ఓ సారి ట్రై చేయోచ్చు.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



