పోలీసుల 'కస్టడీ'లో నాగ చైతన్య!
on Nov 23, 2022
'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి విజయాల తర్వాత 'థాంక్యూ'తో నిరాశపరిచిన అక్కినేని హీరో నాగ చైతన్య మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. తన 22వ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.
ఈరోజు(నవంబర్ 23) చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా 'NC 22' నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'కస్టడీ' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వెంకట్ ప్రభు శైలిలో విభిన్నంగా ఆకట్టుకునేలా ఉంది. ఒంటినిండా గాయాలు, మెడలో రుద్రాక్షతో పోలీస్ యూనిఫామ్ ధరించి ఉన్న చైతన్యను చాలామంది పోలీసులు కలిసి గన్నులు గురిపెట్టి అదుపులోకి తీసుకుంటున్నట్టుగా పోస్టర్ లో ఉంది. చైతన్య ధరించిన యూనిఫామ్ కి 'శివ' అనే నేమ్ బ్యాడ్జ్ ఉంది. చైతన్య ఇంటెన్స్ లుక్ తో ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.