కోడి బుర్ర.. దిమ్మతిరిగేలా 'హిట్-2' ట్రైలర్
on Nov 23, 2022
అడివి శేష్ ప్రధాన పాత్రలో శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హిట్-2'(హిట్: ది సెకండ్ కేస్). 2020 లో విడుదలై మంచి విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి సీక్వెల్ గా వస్తోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'హిట్-2' నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
రెండున్నర నిమిషాల నిడివి గల 'హిట్-2' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఒక యువతిని ఎవరో దారుణంగా హత్య చేసి శరీర భాగాలు వేరు చేస్తారు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ కృష్ణ దేవ్ గా అడివి శేష్ కనిపిస్తున్నాడు. క్రిమినల్స్ వి కోడి బుర్రలని, తెలివిగా ఆలోచించలేరనే భ్రమలో ఉండే కృష్ణ దేవ్ కి ఈ కేసు సవాల్ గా మారుతుంది. అసలు ఆ శరీర భాగాల్లో తల ఒక్కటే ఆ యువతిదని, మిగతా భాగాలు వేరు వేరు వ్యక్తులవని తెలుసుకొని ఆఫీసర్ కంగుతింటాడు. అసలు ఆ క్రిమినల్ ఎవరు? ఎందరు ఇదంతా చేస్తున్నారు? ఆ క్రిమినల్ ని కృష్ణ దేవ్ పట్టుకోగలిగాడా? వంటి ప్రశ్నలు ఆడియన్స్ లో రేకెత్తించేలా చేసి, ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు. కంటెంట్, విజువల్స్ పరంగా 'హిట్-1'ని 'హిట్-2' ఉండబోతుందని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. అడివి శేష్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ, జాన్ స్టీవర్ట్ ఏడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్రధాన బలంగా నిలిచాయి.
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.