‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ మూవీ రివ్యూ
on Jan 28, 2023
సినిమా : ముకుందన్ ఉన్ని అసోసియేట్స్
డైరెక్టర్ : అభినవ్ సుందర్ నాయక్
ప్రొడ్యూసర్: అజిత్ జాయ్
తారాగణం: వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, ఆర్ష చాందిని బైజు, రియా సైరా, సుధీ కొప్ప,
సూరజ్ వెంజరమూడు, జగదీష్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ ఒడుక్కతిల్.
సంగీతం : సిబి మాథ్యూ అలెక్స్
ఎడిటింగ్: నిధిన్ రాజ్ అరోల్
ప్రొడక్షన్ కంపెనీ: జాయ్ మూవీ ప్రొడక్షన్స్
ఒటిటి: డిస్నీ + హాట్ స్టార్.
కథ:
ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా మొదలవుతుంది 'ముకుందన్ ఉన్ని' క్యారెక్టర్ . మొదట ఒక మాజీ MLA కేస్ ని ముకుందన్ వాదిస్తానంటూ వెళ్ళగా.. దానికి ఆ MLA ఒప్పుకోకుండా సీనియర్ లాయర్ తో చెప్పడంతో... అతను ముకుందన్ ని పనిలో నుండి తీసేస్తాడు. దీంతో ముకుందన్ ఒక నెల రోజుల పాటు ఒక్క కేసు కూడా లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. అప్పడే ఒకరోజు వాళ్ళ అమ్మని హాస్పిటల్ లో జాయిన్ చేయవలసి వస్తుంది. అక్కడ లాయర్ వేణు పరిచయం అవుతాడు. అతడు ముకుందన్ కి యాక్సిడెంట్ లా క్రియేట్ చేయమని దగ్గరుండి చేపిస్తాడు. మామూలుగా తాకిన గాయాలను ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేపిస్తాడు. ఆ తర్వాత ఫేక్ యాక్సిడెంట్ సర్టిఫికేట్ తయారు చేపించి, పాలసీ తీసుకుంటాడు. అలా వేణు చేసే మోసం ముకుందన్ కి నచ్చుతుంది. అయితే ఇదంతా ఎలా చేస్తున్నారని వేణుని, అతడి అనుచరుడిని ఫాలో చేస్తూ తెలుసుకుంటాడు ముకుందన్. ఆ తర్వాత తనే స్వంతంగా యాక్సిడెంట్ క్లెయిమ్ పాలసీ చేపిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తాడు. అలా ఒక స్టేజ్ లో తను చేసిన మోసం స్వయంగా జడ్జ్ కనిపెడతాడు. ముకుందన్ ఫోర్జరీ కేస్ ని ఒక స్పెషల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ముకుందన్ ఫోర్జరీ చేసినట్టుగా తెలుస్తుందా? ఆ పోలీస్ నుండి ముకుందన్ తప్పించుకున్నాడా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్' ఒక సాధారణ లాయర్ ఉన్నతస్థాయికి ఎదగడానికి ఎలాంటి పనులు చేసాడో చూపించే సినిమా. కొందరు మనుషులు సాధారణంగా హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్ తో జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మరికొందరు అడ్డదారుల్లో పేరుప్రఖ్యాతులు, డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తుంటారు. అయితే అందరూ మొదటిదారిని ఎన్నుకుంటే ఈ సినిమాలో 'ముకుందన్ ఉన్ని' రెండో దారిని ఎన్నుకుంటాడు. ఒక లాయర్ కథకు ఫేక్ యాక్సిడెంట్ పాలసీ క్లెయిమ్ అనే ఆసక్తికరమైన పాయింట్ ను తీసుకొని డైరెక్టర్ 'అభినవ్ సుందర్ నాయక్' ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ముకుందన్ ఉన్ని పాత్రను కంప్లీట్ నెగెటివ్ షేడ్స్ లోనే చూపించాడు డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్. తన స్వంత ప్రయోజనం కోసం తనకు ఎదురొచ్చినవాళ్ళనే కాకుండా, తనతో ఉన్నవాళ్ళని కూడా చంపడానికి వెనుకాడనివాడిలా 'ముకుందన్ ఉన్ని' చేసిన నటించిన తీరు ఆకట్టుకుంటుంది. ముకుందన్ కి సపోర్ట్ గా లాయర్ వేణు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వేణునే మొదట ఈ ఫేక్ యాక్సిడెంట్ క్లెయిమ్ పాలసీని ప్రారంభించింది. ఆ తర్వాత హాస్పిటల్ లో పనిచేసే రిసెప్షనిస్ట్ పాత్రలో ముకుందన్ భార్య మీనాక్షి పరిచయమై.. ఆ తర్వాత ప్రతీ విషయంలోను సపోర్ట్ చేస్తూ ముకుందన్ ఎదుగుదలకు కారణం అవుతుంది.
ఈ సినిమాకి మాథ్యూ అలెక్స్ సంగీతం ప్రాణం పోసింది. నిధిన్ రాజ్ అరోల్ ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయ్యింది. విశ్వజిత్ ఒడుక్కతిల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. జాయ్ మూవీ ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
హీరోలో విలన్ పాత్రని చేయడం మాములు విషయం కాదు. కానీ ఈ సినిమాలో ముకుందన్ గా చేసిన వినీత్ శ్రీనివాసన్ వన్ మ్యాన్ షో గా అలరించాడు. మొదట ముకుందన్ కి పరిచయం అయిన లాయర్ వేణు పాత్రలో సూరజ్ వెంజరమూడు ఒదిగిపోయాడు. ముకుందన్ ప్రేమించిన అమ్మాయిగా మీనాక్షి పాత్రలో ఆర్ష చాందిని బైజు ఆకట్టుకుంది. ముకుందన్ కి అసిస్టెంట్ గా రాబిన్ పాత్రలో సుధీ కొప్ప తన సపోర్ట్ ఇచ్చాడు. అడ్వకేట్ జ్యోతి పాత్రలో తన్వి రామ్ ఉన్నంతలో ఆకట్టుకుంది.
తెలుగువన్ పర్స్ పెక్టివ్ :
ఒక సాధారణ వ్యక్తి నుండి ఉన్నతస్థాయికి రావడానికి అడ్డదార్లు తొక్కే హీరో పాత్రని విలన్ గా మలిచిన తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా మొత్తం ముకుందన్ గా తన లైఫ్ ని కథలా చెప్పడమనేది ఒక ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది.
రేటింగ్ : 3.5/ 5
✍️. దాసరి మల్లేశ్

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
