ENGLISH | TELUGU  

మిస్టర్ మజ్ను రివ్యూ

on Jan 25, 2019

 

నటీనటులు: అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, రావు రమేష్, పవిత్రా లోకేష్, జయప్రకాశ్, ప్రియదర్శి, హైపర్ ఆది, సుబ్బరాజు, అజయ్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
పాటలు: శ్రీమణి
కొరియోగ్రఫీ: శేఖర్
కెమెరా: జార్జ్ సి. విలియమ్స్
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాత‌: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్   
కథ, మాటలు, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: జనవరి 25, 2019

అక్కినేని హీరోలకు రొమాంటిక్ సినిమాలు కలిసి వచ్చాయి. ఏయన్నార్ నుంచి నాగచైతన్య వరకూ మూడు తరాల హీరోలకు విజయాలు అందించాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య చక్కటి ప్రేమకథా చిత్రాల్లో నటించారు. అఖిల్ మాత్రం మొదటి సినిమాకు మాస్ కమర్షియల్ కథను ఎంపిక చేసుకున్నాడు. రెండో సినిమా 'హలో'లోనూ యాక్షన్, ఫైట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. రెండూ పరాజయం పాలవడంతో మూడో సినిమాకు ప్రేమకథను ఎంచుకున్నాడు. 'మిస్టర్ మజ్ను' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏయన్నార్ 'లైలా మజ్ను', నాగార్జున 'మజ్ను' సినిమాలతో విజయాలు అందుకున్నారు. అఖిల్ అక్కినేనికి 'మజ్ను' సెంటిమెంట్ కలిసి వచ్చిందా?  'తొలిప్రేమ'తో విజయాన్ని, ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాను తీశాడు? సినిమా ఎలా ఉంది? ఓ లుక్కేయండి.  

క‌థ‌:

విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్ అక్కినేని) ఓ ప్లేబాయ్. చెల్లెలి పెళ్లి  కోసం లండన్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు ఫ్లైట్ లో నికిత అలియాస్ నిక్కి (నిధి అగర్వాల్)ను చూస్తాడు. ఆల్రెడీ విక్కీ గురించి నిక్కీకి తెలుసు. అందువల్ల, అతడికి దూరంగా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే... విక్కీకి కాబోయే బావ చెల్లెలు నిక్కీ. మొదట్లో విక్కీని అసహించుకున్న నిక్కీ మెల్లగా అతణ్ణి ప్రేమిస్తుంది. తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. నెల రోజులకు మించి తాను ఏ అమ్మాయితోనూ రిలేష‌న్‌షిప్‌లో లేనని, ఈ ప్రేమ త‌న వ‌ల్ల కాద‌ని విక్కీ చెబుతాడు. రెండు నెల‌లు రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌టానికి ప్ర‌య‌త్నిద్దామ‌ని నిక్కీ క‌న్వీన్స్ చేస్తుంది. త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల్లో విక్కీ స‌రేనంటాడు. కానీ, నిక్కీ ప్రేమ‌ను అర్థం చేసుకోడు. ఇబ్బందిగా ఫీల‌వుతాడు. ఈ ఇబ్బంది నిక్కీకి తెలిసేలోపే వీళ్ల ప్రేమ సంగ‌తి ఇరువురి ఇళ్ల‌లో తెలుస్తుంది. పెళ్లి చేద్దామనుకుంటారు. అప్పుడు విక్కీకి బ్రేకప్ చెబుతుంది నిక్కీ. తరవాత నిక్కీ ప్రేమను విక్కీ అర్థం అవుతుంది. ఆమె ప్రేమను తిరిగి సొంతం చేసుకోవడానికి విక్కీ ఏం చేశాడు? ఏమైంది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ:

నెల రోజులకు మించి ఏ అమ్మాయితోనూ రిలేష‌న్‌షిప్‌లో లేని అబ్బాయి.. రెండు నెల‌లు ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటే మారతాడా? మారతాడని ఓ అమ్మాయి బలంగా నమ్మడంలో బలమైన అంశం ఏదీ కనిపించదు. అందువల్ల, సినిమా సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఏవీ బలంగా అనిపించలేదు. ప్రతి అమ్మాయితోనూ ముద్దు ముచ్చట కోరుకునే ఓ అబ్బాయి, రెండు నెలలు ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పిన అమ్మాయి దగ్గర్నుంచి కూడా ముద్దులు కోరుకునే అబ్బాయి... అమ్మాయి వెళ్లిపోయిన తరవాత ఆమె ప్రేమను కనెక్ట్ కావడం ఏంటో అర్థం కాదు. అందువల్ల, ఎమోషనల్ సన్నివేశాలు ఏవీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవుతాని అనుకోవడం లేదు. పైగా, బలవంతంగా తెరపై చూస్తున్న భావన కలుగుతుంది.  

సినిమా ఫస్టాఫ్ లో కథను ప్రారంభించిన విధానం బావుంది. ప్లేబాయ్‌గా అఖిల్‌ ప‌ర్‌ఫెక్ట్‌గా సూట‌య్యాడు. అక్కినేని హీరోలకు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ కూడా కలిసొచ్చింది. కథ లండన్ నుంచి ఇండియాకు షిఫ్ట్ అయిన తరవాత కూడా కుటుంబ అనుబంధాలను చూపించిన తీరు బావుంది. కానీ, తరవాత వచ్చే ప్రేమకథలో పట్టు లేదు. హీరో హీరోయిన్లు బ్రేకప్ కావడంలో సరైన కాన్‌ఫ్లిక్ట్ లేదు. అందుకని, సెకండాఫ్ సరైన దారిలో వెళ్లలేదు. హీరోయిన్ ప్రేమను తిరిగి పొందడం కోసం చేసే పనులు అంతా ఆకట్టుకోలేదు. పైగా, ఈ సినిమాలో ప్రేమకథ, ప్రేమకథలో హీరోయిన్ ప్రవర్తించే తీరు రాజ్ తరుణ్ 'రంగులరాట్నం' సినిమాను గుర్తు చేస్తుంది. అన్నట్టు.. ఆ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించారు.

దర్శకుడు వెంకీ అట్లూరి కొన్ని సన్నివేశాలను బలంగా రాసుకున్నాడు. మాటలు కూడా. కానీ, సినిమా అంతా అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు. తమన్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బావున్నాయి.

ప్లస్ పాయింట్స్:

ఫస్టాఫ్
ప్లేబాయ్‌గా అఖిల్ న‌ట‌న‌
సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్
క‌థ‌లో బలం లేదు. సరైన కాన్‌ఫ్లిక్ట్ లేదు.
ఎమోషనల్ సీన్స్
 
నటీనటుల పనితీరు:

సినిమాకు అఖిల్ నటనే బలం, బలహీనత. ప్లేబాయ్‌గా ఫ‌ర్‌ఫెక్ట్ సూటైన అఖిల్‌, ఏమోష‌న‌ల్ స‌న్న‌వేశాల్లో అంత‌గా ఆక‌ట్టుకోలేదు. నిధి అగర్వాల్ అందంగా, అంతకు ముంచి సన్నగా కనిపించింది. కానీ, డైలాగులకు లిప్ సింక్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. ప్రియదర్శి ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. 'హైపర్' ఆది పాత్ర క్లిక్ కాలేదు. మిగతా నటీనటుల్లో పేరున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, ఎవరికీ పెద్దగా నటించే అవకాశం రాలేదు.

చివరగా:

ఇదో సాదాసీదా ప్రేమకథ. దాన్ని వెంకీ అట్లూరి అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ప్లేబాయ్‌గా అఖిల్ ఆకట్టుకున్నాడు. అయితే కథకు అదొక్కటే చాలదు. ఎమోషనల్ సన్నివేశాల్లో నటుడిగా మరింత పరిణితి చూపించాలి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే సరదాగా కాసేపు ఎంజాయ్ చేయవచ్చు. ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.