'మన్మథుడు'గా నాగార్జున అలరించి 20 ఏళ్ళు!
on Dec 20, 2022

అక్కినేని నాగార్జున కెరీర్ లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో 'మన్మథుడు' ముందు వరుసలో ఉంటుంది. 2002, డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని బుల్లితెరపై చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం విడుదలై నేటితో 20 వసంతాలు పూర్తయింది.
అప్పట్లో దర్శకుడు కె.విజయ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది. అప్పటికే వారి కాంబోలో 'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ఆ తర్వాత వారి కలయికలో నాగార్జున హీరోగా రూపొందిన చిత్రమే 'మన్మథుడు'. ఈ చిత్రంలోని సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేమ సన్నివేశాలు ఎంతలా మనసుకి హత్తుకునేలా ఉంటాయో.. హాస్య సన్నివేశాలు అంతకంటే ఎక్కువగా కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూశారు.. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. 'మన్మథుడు' విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. 'అందమైన భామలు', 'గుండెల్లో ఏముందో', 'డోన్ట్ మ్యారీ బి హ్యాపీ', 'నా మనసునే', 'నేను నేనుగా లేనే', 'చెలియా చెలియా' ఇలా ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో సోనాలి బెంద్రే, అన్షు, బ్రహ్మానందం, సునీల్, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2002 కి గాను ఉత్తమ చిత్రంగా 'మన్మథుడు' నంది అవార్డు గెలుచుకోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



