కాలికి గాయం.. ప్రేమ్ రక్షిత్ కి థాంక్స్ చెప్పిన మంచు విష్ణు!
on Sep 1, 2022

మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విష్ణు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ చిత్రం కోసం ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ వంటి బడా కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దింపాడు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఇందులో విష్ణు డ్యాన్స్ లు అదరగొట్టాలని ఫిక్స్ అయ్యాడని. అయితే తాజాగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులు వేస్తూ కాలికి పెద్ద గాయం చేసుకున్నాడు విష్ణు.
'ఆర్ఆర్ఆర్'లో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన 'నాటు నాటు' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులో తారక్, చరణ్ కలిసి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీల్స్ లో అయితే ఆ స్టెప్పులే ఎక్కువగా దర్శనమిచ్చాయి. ఇప్పుడు 'జిన్నా'లో విష్ణు కోసం కూడా ప్రేమ్ రక్షిత్ ఆ రేంజ్ లో స్టెప్పులు కంపోజ్ చేశాడా అన్న సందేహం కలుగుతోంది.
తాజాగా విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోని షేర్ చేశాడు. అందులో మోకాలి పైన పెద్ద గాయమైనట్లు కనిపిస్తోంది. దానికి "థాంక్యూ ప్రేమ్ రక్షిత్" అనే క్యాప్షన్ జోడించిన విష్ణు.. "డ్యాన్స్ చేస్తూ కాలికి ఇంత తీవ్రంగా గాయం చేసుకుంటానని నేనసలు ఊహించలేదు" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'జిన్నా'లో విష్ణు ఏ రేంజ్ లో డ్యాన్స్ లతో అదరగొట్టనున్నాడో అనేది ఈ ఫోటోతో అర్థమవుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకుడు. జి.నాగేశ్వరరెడ్డి మూలకథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



