కుల దూషణ.. నితిన్ సినిమాకి శాపంగా మారిన డైరెక్టర్ ట్వీట్స్!
on Jul 27, 2022

ఒక వ్యక్తి మీదో, ఒక కులం మీదో అభిమానం ఉండొచ్చు. కానీ ఇతర వ్యక్తులని, ఇతర కులాలను కించపరచకూడదు. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాలలో రాణించాలనుకునేవారు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆవేశంలో కొందరు వ్యక్తుల్ని, కులాలను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు తర్వాత వాళ్ళ కెరీర్ పైనే తీవ్ర ప్రభావం చూపించొచ్చు. ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' దర్శకుడి పరిస్థితి అలాగే ఉంది.

ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నితిన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేశాయి. కానీ గతంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసిన కొన్ని ట్వీట్స్ ఇప్పుడు ఆ సినిమాకి శాపంగా మారుతున్నాయి.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అభిమాని. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిచిన సమయంలో.. ఆయన 'కమ్మ', 'కాపు' కులాలను దూషిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్వీట్స్ కనిపిస్తున్నాయి. అంత కులాభిమానం ఉంటే మీ నాయకుడిపై చూపించుకో.. అంతేగాని ఇలా ఇతర కులాలను ఎలా దూషిస్తావు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అయితే ఎస్ఆర్ శేఖర్ పేరుతో 2019 లో చేసినట్లుగా కనిపిస్తున్న ట్వీట్స్ ఫేక్ అని డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, హీరో నితిన్ అంటున్నారు. ఎవరో కావాలని దురుద్దేశంతోనే అలా ఎడిట్ చేశారని చెబుతున్నారు. అయినప్పటికీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద ట్రోల్స్ ఆగట్లేదు. ఆయన ట్విట్టర్ ఖాతాలో 'కమ్మ', 'కాపు' కులాలను దూషించిన ట్వీట్స్ డిలీట్ చేసి, ప్రొఫైల్ నేమ్ కొంచెం ఛేంజ్ చేసుంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటికీ ఆయన ఖాతాలో కులాభిమానం చాటేలా ట్వీట్స్, చంద్రబాబు వంటి నాయకులను కించ పరిచేలా ట్వీట్స్ ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా ఈ వివాదం 'మాచర్ల నియోజకవర్గం' సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



