'ఓం 3D' దెబ్బకు సినిమాలు మానేద్దామనుకున్నా!
on Jul 27, 2022

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. తన సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తూ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటాడు. తెలుగులో మొదటి 3D సినిమా తీసిన క్రెడిట్ ఆయనదే. కానీ ఆ ప్రయోగం బెడిసికొట్టింది. ఆ దెబ్బకు సినిమాలు కూడా మానేద్దామనుకున్న కళ్యాణ్ రామ్.. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ కి మల్లిడి వశిష్ఠ దర్శకుడు. ఈ చిత్రం ఆగస్ట్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్.. 'ఓం 3D' గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాని చాలా నమ్మానని, దాదాపు మూడేళ్లు వేరే కథలు కూడా వినకుండా ఆ సినిమా కోసం పని చేశానని అన్నాడు. కానీ ఆ మూవీ రిజల్ట్ చాలా డిజప్పాయింట్ చేసిందని, అసలు తాను వెళ్తున్న దారి సరైందేనా?, సినిమాలు మానేద్దామా? అనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా విడుదలయ్యాక కొన్ని నెలలు ఎవరినీ కలవలేదని, ఆ టైంలో ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ వల్లే మళ్ళీ నిలబడ్డానని చెప్పాడు. 'ఓం 3D' తనకు పాఠం నేర్పించిందని, లైఫ్ లో రిస్క్ చేయాలి గానీ కొన్ని లెక్కలేసుకొని చేయాలని ఆ సినిమా వల్లే తెలిసిందని అన్నాడు.
'బింబిసార' రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపాడు. సొంత వీఎఫ్ఎక్స్ సంస్థ ఉండటం వల్ల కాస్త బడ్జెట్ భారం తగ్గిందని చెప్పాడు. అలాగే ఇప్పుడు డిజిటల్ బిజినెస్ పెరిగిందని, దానికి తోడు దిల్ రాజు సినిమా నచ్చి థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



