రాజేంద్రప్రసాద్ 'ఓనమాలు'కు పదేళ్లు!
on Jul 27, 2022

క్రాంతిమాధవ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'ఓనమాలు'. అదివరకే 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' లాంటి సెన్సిబుల్ స్టోరీస్ చేసిన రాజేంద్రప్రసాద్ చేసిన మరో అర్థవంతమైన, సున్నితమైన కథ 'ఓనమాలు'. నారాయణరావు మాస్టారు అనే పాత్రలో ఆయన మరోసారి తన గొప్ప అభినయాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఈ సినిమా కథ ఆయన పాత్ర చుట్టూ నడుస్తుంది.
నారాయణ రావు మాస్టారు (రాజేంద్రప్రసాద్)కి తను పుట్టిన ఊరన్నా, పల్లె వాతావరణం అన్నా, అక్కడి జనం మధ్య ఉన్న ఆప్యాయతలు అన్నా మహా ఇష్టం. అయితే పిల్లలు అమెరికా వెళ్లి పోవడంతో వారితో పాటు అక్కడికెళ్లిన మాస్టారు మనసుకు ఇష్టం లేకున్నా అక్కడ కొన్నాళ్లు అయిష్టంగానే గడిపి ఇక ఉండలేక మళ్లీ తన పల్లెబాట పడతాడు. తన పల్లె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఊరుచేరుకున్న మాస్టారు, అక్కడి పరిస్థితులను చూసి షాకవుతాడు. ఆయన ఏమాత్రం ఊహించని రీతిలో ఊరు మారిపోతుంది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి నారాయణరావు మాస్టారు ఏం చేశాడు? అనే విషయాన్ని మనసులకు హత్తుకొనేట్లు చిత్రీకరించాడు క్రాంతి మాధవ్.
రాజేంద్రప్రసాద్ భార్యగా కల్యాణి నటించిన ఈ చిత్రంలో చలపతిరావు, గిరిబాబు, రఘుబాబు, కొండవలస, ప్రవీణ్, రవిప్రకాశ్, అనంత్, శివపార్వతి కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు కథారచయితగా సాహితీ లోకంలో మంచి పేరున్న మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన సంభాషణలు బలం. సంగీత దర్శకునిగా కోటి, సినిమాటోగ్రాఫర్‌గా హరి అనుమోలు, గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఎంచుకోవడంతోటే క్రాంతిమాధవ్ అభిరుచి ఎలాంటిదనే విషయం అర్థమవుతుంది.
సూరీడు వొచ్చిండు, అరుదైన సంగతి, పండుగ అంటే, పిల్లలు బాగున్నారా పాటలను ఇప్పుడు వింటుంటే ఇంకా బాగున్నాయనిపిస్తుంది. సన్‌షైన్ సినిమా బ్యానర్‌పై క్రాంతిమాధవ్ స్వయంగా నిర్మించిన 'ఓనమాలు' చిత్రం సరిగ్గా పదేళ్ల క్రితం 2012 జూలై 27న విడుదలైంది. ఇలాంటి చక్కని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించకపోవడం బాధాకరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



